నటిపై 3 కోట్ల నష్టపరిహార దావా
Nora Fatehi is facing a Rs 3-crore civil defamation suitబాహుబలి మనోహరిగా పాపులరైంది.. డాన్సర్ కం నటి నోరా ఫతేహి. అయితే ఈ బ్యూటీ ఎరక్కపోయి ఇరుక్కుపోయింది. నోరా సోషల్ మీడియాలో సరదాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తనను చట్టపరమైన చిక్కుల్లోకి నెట్టాయి. గతేడాది డిసెంబర్లో ముంబై నుంచి జైపూర్ వెళ్లే క్రమంలో తాను ప్రయాణించిన `సెస్నా సైటేషన్ CJ2` చార్టర్డ్ విమానంలో వీడియో రికార్డ్ చేసిన నోరా, ఆ విమానాన్ని ఉద్దేశించి `టాయ్ ప్లేన్`, `లేగో ఏరోప్లేన్`, `మినియేచర్` అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో వ్యాఖ్యానించారు.
సాంకేతిక పరిజ్ఞానం లేకుండా... ఎలాంటి సత్యనిరూపణ చేసుకోకుండా 4.6 కోట్లకు పైగా ఫాలోవర్లు ఉన్న వేదికపై చేసిన ఈ నిర్లక్ష్యపు పోస్ట్‌ల వల్ల తమ కంపెనీ బ్రాండ్ ఇమేజ్, వ్యాపార ప్రతిష్ట దారుణంగా దెబ్బతిన్నాయని పేర్కొంటూ `డ్యూన్స్ ఏవియేషన్` సంస్థ గాంధీనగర్ కోర్టును ఆశ్రయించింది.
నోరా వ్యాఖ్యల కారణంగా తమ విమాన బుకింగ్స్ ఏకంగా 15 నుండి 20 శాతం వరకు పడిపోయాయని.. ఇప్పటికే నమోదైన బుకింగ్స్ కూడా భారీగా క్యాన్సిల్ అయ్యాయని ఆ విమానయాన సంస్థ ఆరోపించింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) నిబంధనల ప్రకారం అన్ని సర్టిఫికెట్లతో చట్టబద్ధంగా నడుస్తున్న విమానంపై నటి నోరా ఫతేహి చేసిన అసత్య ప్రచారం వల్ల తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లిందని పేర్కొంటూ 3 కోట్ల నష్టపరిహారం కోరుతూ సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో దావా వేసింది.
దీనితో పాటు నోరా పోస్ట్ చేసిన సదరు వీడియోలను సోషల్ మీడియా నుండి వెంటనే తొలగించాలని.. బహిరంగంగా వివరణ ఇవ్వాలని కోరింది. ఈ పిటిషన్‌పై గాంధీనగర్ కోర్టు సెప్టెంబర్ 25న విచారణ చేపట్టనుంది.







































