రీ ఎంట్రీ కథనాలపై క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్!
Katrina Kaif is reportedly back to reading scriptsబాలీవుడ్ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న అగ్ర కథానాయిక కత్రినా కైఫ్ మళ్లీ వెండితెరపై మెరవబోతోందని కొన్ని రోజులుగా సోషల్ మీడియా లో జోరుగా ప్రచారం సాగుతోంది. త్వరలోనే భారీ ప్రాజెక్టు ద్వారా సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వనుందని.. దీనికి సంబంధించిన ప్రాథమిక చర్చలు కూడా ముగిసాయని పలు ప్లాట్‌ఫారమ్‌లలో కథనాలు వెలువడ్డాయి. గత కొంతకాలంగా కత్రినాను వెండితెరపై చూడాలని ఎంతగానో ఎదురు చూస్తున్న అభిమానులకు ఈ వార్తలు ఎంతో ఉత్సాహాన్ని కలిగించాయి.
తాజాగా ఈ ప్రచారం వెనుక అసలు నిజం వెలుగులోకి వచ్చింది. కత్రినా కైఫ్ చిత్రరంగ పునప్రవేశం గురించి వస్తున్న వార్తలన్నీ పుకార్లేనని.. వాటిలో ఎలాంటి వాస్తవం లేదని క్యాట్ అధికారిక ప్రతినిధుల బృందం
క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె కొత్త సినిమాలేవీ ఒప్పుకోలేదని మీడియాలో వస్తున్న ఊహాగానాలను నమ్మవద్దని వారు తేల్చిచెప్పారు. గత రెండేళ్లుగా చిత్ర పరిశ్రమకు పూర్తిగా దూరంగా ఉంటున్న కత్రినా ప్రస్తుతం వ్యక్తిగత జీవితానికి .. కుటుంబ బాధ్యతలకే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నట్లు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.
కుమారుడు విహాన్ కౌశల్ జననం తర్వాత కత్రినా కైఫ్ మాతృత్వంలోని మధురానుభూతులను సంపూర్ణంగా ఆస్వాదిస్తోంది. భర్త విక్కీ కౌశల్, కొడుకు విహాన్‌లతో కలిసి సంతోషకరమైన సమయాన్ని గడుపుతోంది. అప్పుడప్పుడు కుటుంబంతో కలిసి విహారయాత్రలకు వెళ్తుంది. వాటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాలలో పంచుకుని అభిమానులను అలరిస్తోంది.








































