Advertisementt

పార్టీల‌కు అతీతంగా ప‌వ‌న్‌కి ప‌రామ‌ర్శ‌

Sun 19th Apr 2026 06:51 PM
pawan kalyan  పార్టీల‌కు అతీతంగా ప‌వ‌న్‌కి ప‌రామ‌ర్శ‌
PM Modi and other celebrities wished Pawan Kalyan a speedy recovery పార్టీల‌కు అతీతంగా ప‌వ‌న్‌కి ప‌రామ‌ర్శ‌
Advertisement
Ads by CJ

జనసేన అధినేత, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఉప ముఖ్య‌మంత్రి పవన్‌ కల్యాణ్ ఆకస్మికంగా అనారోగ్యానికి గురై శస్త్రచికిత్స చేయించుకున్నారనే వార్త తెలుగు రాష్ట్రాల్లోని సినీ, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. పవన్ ఆరోగ్యం క్షీణించిందనే ప్రచారం సాగడంతో అటు అభిమానులు, ఇటు రాజకీయ నేతలు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. అయితే ఆయనకు విజయవంతంగా శస్త్రచికిత్స పూర్తయిందని తెలియడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి, నాగ‌బాబు స‌హా ప‌వ‌న్ స‌తీమ‌ణి అన్నా లెజినోవా ప‌వ‌న్ రిక‌వరీ బావుంద‌ని స్వ‌యంగా ప్ర‌క‌టించ‌డం పెద్ద ఊర‌ట‌. ఈ క్రమంలో రాజకీయ విభేదాలను పక్కన పెట్టి అన్ని పార్టీల నాయకులు పవన్ ఆరోగ్యంపై ఆరా తీయడం విశేషం.

పవన్‌ కల్యాణ్ క్షేమ సమాచారం తెలుసుకునేందుకు దేశ ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా స్పందించారు. పవన్‌ను `ధైర్యవంతుడు`గా అభివర్ణిస్తూ ఆయన త్వరగా కోలుకోవాలని మోదీ ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా పవన్ ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేస్తూ ఆయనకు ధైర్యం చెప్పారు. అదేవిధంగా రాజకీయంగా ప్రత్యర్థి అయినప్పటికీ వైసీపీ నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సైతం పవన్ ఆరోగ్యం గురించి ఆరాలు తీయడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. తెలంగాణకు చెందిన పలువురు మంత్రులు, జాతీయ స్థాయి నాయకులు కూడా పవన్ యోగక్షేమాలు కనుక్కుని పరామర్శలు చేసారు.

తెలంగాణ రాష్ట్రం నుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పవన్ కల్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఆయనతో పాటు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, సీతక్క వంటి ప్రముఖులు మెగా కుటుంబ సభ్యులకు , అలాగే జనసేన వర్గాలకు ఫోన్ చేసి పవన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఫోన్ చేసి ప‌వ‌న్ క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. అలాగే బిజెపి జాతీయ అధ్యక్షుడు జె.పి. నడ్డా, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ వంటి వారు పవన్ ఆరోగ్య స్థితిగతులపై ఆరా తీశారు. తెలంగాణ ప్రతిపక్ష నేతలు, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తరపున ఆ పార్టీ కార్యాలయం నుండి కీలక నేతలు పవన్ ఆరోగ్యంపై వాకబు చేశారు. మాజీ మంత్రి కేటీఆర్ కూడా సోషల్ మీడియా వేదికగా .. వ్యక్తిగతంగా పవన్ త్వరగా కోలుకోవాలని తన ఆకాంక్షను వ్యక్తం చేశారు.

మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడు పవన్ కల్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అభిమానులకు అవసరమైన సమాచారాన్ని అందించారు. పవన్‌కు జరిగిన శస్త్రచికిత్స విజయవంతమైందని.. ప్రస్తుతం ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారని చిరంజీవి వెల్లడించారు. తమ్ముడి ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ.. పవన్ త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో ప్రజాక్షేత్రంలోకి వస్తారని భరోసా ఇచ్చారు. చిరంజీవి స్వయంగా ఆసుపత్రి వద్ద ఉండి చికిత్స ప్రక్రియను పర్యవేక్షించడం అభిమానులకు ధైర్యాన్ని ఇచ్చింది.

కేవలం రాజకీయ నేతలే కాకుండా సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ హీరోలు, దర్శకులు సోషల్ మీడియా వేదికగా పవన్‌ కల్యాణ్ కోలుకోవాలని ప్రార్థించారు. అభిమానులు రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి తమ అభిమాన నటుడిపై ఉన్న ప్ర‌గాఢ‌మైన‌ ప్రేమను చాటుకున్నారు. పార్టీలకతీతంగా లభించిన ఈ ఆదరణ పవన్‌ కల్యాణ్ రాజకీయ, సినీ వ్యక్తిత్వానికి ఉన్న గౌరవాన్ని సూచిస్తోంది. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్న ప‌వ‌న్‌ కొద్దిరోజుల విశ్రాంతి అనంతరం తిరిగి తన రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొననున్నారు.

PM Modi and other celebrities wished Pawan Kalyan a speedy recovery:

 Pawan Kalyan undergoes emergency surgery

Tags:   PAWAN KALYAN
Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ