ర‌ణ్‌వీర్‌పై బ్యాన్ ఎత్తేసిన‌ ఫెడ‌రేష‌న్

Ban on Ranveer Singh revoked

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్, ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియన్ సినీ ఎంప్లాయిస్ (FWICE) మధ్య నడుస్తున్న `డాన్ 3` వివాదం ముగింపు దశకు వచ్చింది. ఈ ప్రతిష్టాత్మక చిత్రం నుండి రణ్‌వీర్ తప్పుకోవడంతో అత‌డిపై విధించిన నాన్-కోఆపరేషన్ (సహాయ నిరాకరణ) ఆదేశాలను తక్షణమే ఉపసంహరించుకుంటున్నట్లు ఫెడరేషన్ జూన్ 3న అధికారిక పత్రికా ప్రకటనలో ప్రకటించింది.

`ఇండియన్ మోషన్ పిక్చర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్` (IMPPA) జోక్యం, ఇండస్ట్రీలో ఐక్యతను కాపాడాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. అయితే రణ్‌వీర్ సింగ్ ఒక రోజు క్రితమే ఫెడరేషన్‌కు లీగల్ నోటీసులు పంపిన నేపథ్యంలో ఈ ఉపసంహరణ నిర్ణ‌యం తీసుకోవ‌డంపై గుసగుస‌ల‌కు తావిచ్చింది.

తమకు లీగల్ నోటీసులు అందిన మాట వాస్తవమేనని, దానికి చట్టపరంగానే సమాధానం ఇస్తామని FWICE చీఫ్ అడ్వైజర్ అశోక్ పండిట్ స్పష్టం చేసినా ఇంత‌లోనే బ్యాన్ ఎత్తివేయ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఎవరినీ నిషేధించే అధికారం తమకు లేదని ఒప్పుకుంటూనే... రణ్‌వీర్ స్టార్‌డమ్‌ను తాము గౌరవిస్తామని.. ఆయన తమతో కూర్చుని ఈ సమస్యకు సామరస్యపూర్వక పరిష్కారం కనుగొనాలని విజ్ఞప్తి చేశారు.

నిర్మాతల సంఘాలతో ఇంకా చర్చలు కొనసాగుతున్నాయని, పరస్పర గౌరవంతో ఈ వివాదానికి శాశ్వత ముగింపు పలకాలని ఫెడరేషన్ కోరింది. గత కొన్ని వారాలుగా బాలీవుడ్‌లో తీవ్ర ఉత్కంఠ రేపిన ఈ వివాదం ఫెడరేషన్ వెనక్కి తగ్గడంతో ప్రస్తుతానికి సద్దుమణిగింది.
 

Ranveer Singh FWICE standoff ends as the federation withdraws its work ban