ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో అతిపెద్ద IMAX స్క్రీన్

AMB Classic Victory IMAX In Hyderabad

హైదరాబాద్‌లో బెస్ట్ సినిమా వీక్ష‌ణ అనుభ‌వం ఎక్క‌డ? అంటే `ప్రసాద్స్ ఐమ్యాక్స్` పేరు విన‌ప‌డేది. అయితే కొన్నేళ్ల క్రితం దీనిని తొల‌గించ‌డం సినీప్రియుల‌ను క‌ల‌త‌కు గురి చేసిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత మ‌రో ఐమ్యాక్స్ ఎప్పుడు ప్రారంభ‌మ‌వుతుందా? అంటూ ఆస‌క్తి నెల‌కొంది. ఎట్ట‌కేల‌కు ఇప్పుడు హైద‌రాబాద్ లో ఐమ్యాక్స్ స్క్రీన్ ని ప్రారంభించ‌నున్న‌ట్టు అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డింది.  

దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా `ఏఎంబీ మాల్స్`ను మెట్రో న‌గరాల‌లో వేగంగా విస్తరిస్తున్న క్రమంలో హైద‌రాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ వేదికగా నిర్మిస్తున్న‌ సరికొత్త ప్రాపర్టీ `ఏఎంబీ క్లాసిక్ విక్టరీ`లో సరికొత్త ఐమాక్స్ (IMAX) స్క్రీన్‌ను ప్రారంభించ‌నున్నామ‌ని ఏఎంబి యాజ‌మాన్యం వెల్ల‌డించింది. సూప‌ర్ స్టార్ మహేష్ బాబు- విక్ట‌రీ వెంక‌టేష్- రానా బృందంతో క‌లిసి సునీల్ నారంగ్, భరత్ నారంగ్ దీనిని ప్రారంభించ‌నున్నారు.

ఈ ప్ర‌క‌ట‌న‌తో ఏపీ-తెలంగాణ‌లో మొట్ట‌మొద‌టి ఐమ్యాక్స్ స్క్రీన్ కి ఏఎంబి సినిమాస్ తెర‌తీసింది. గతంలో సౌత్ ఇండియాలోనే మొదటి డాల్బీ సినిమాను, హైదరాబాద్‌లో మొదటి హెచ్‌డిఆర్ బై బార్కో స్క్రీన్‌లను పరిచయం చేసిన ఏఎంబీ సినిమాస్.. ఇప్పుడు అదే ఎగ్జిబిషన్ లెగసీని ఐమాక్స్ ద్వారా మరింత ముందుకు తీసుకెళ్తోంది.

ఈ సరికొత్త మల్టీప్లెక్స్ హైదరాబాద్ సినీ చరిత్రలో ఎంతో చారిత్రాత్మక ప్రాధాన్యత కలిగిన `సుదర్శన్ 70ఎమ్ఎమ్` థియేటర్ ప్రాంగణంలో శరవేగంగా రూపుదిద్దుకుంటోంది. సుద‌ర్శ‌న్ థియేట‌ర్  ద‌శాబ్ధాల సుదీర్ఘ చ‌రిత్రను క‌లిగి ఉంది. ఇప్పుడు ఈ థియేట‌ర్ స్థ‌లంలోనే సరికొత్త ఐమాక్స్ సాంకేతికతను జత చేస్తూ ఈ ప్రాజెక్ట్‌ను డిజైన్ చేయడం విశేషం. హాలీవుడ్ స్థాయిలో లార్జ్-ఫార్మాట్ సినిమాలను అసలైన క్వాలిటీతో చూడాలనుకునే ప్రతి ఒక్కరికీ ఈ థియేటర్ ఒక ఫెస్టివ‌ల్ గా మార‌బోతోంది. భార‌త‌దేశంలో మొద‌టిసారి ముగ్గురు హీరోలు క‌లిసి నిర్మిస్తున్న థియేట‌ర్ గాను ఈ ప్రాప‌ర్టీకి గుర్తింపు ద‌క్క‌నుంది. 

AMB Classic Victory Brings First IMAX Screen to Telugu States