ఏపీలో ముంబై నిర్మాతల ఫిలింస్టూడియోలు!
Bollywood Comes For Amaravati
ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి, ఫిల్మ్ స్టూడియోలు, కళా కేంద్రాల స్థాపన కోసం స్థానిక తెలుగు సినీ ప్రముఖులు పెద్దగా చొరవ చూపకపోగా... ముంబైకి చెందిన బాలీవుడ్ ప్రముఖులు, కార్పొరేట్ నిర్మాణ సంస్థలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతుండటం టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల మార్కెట్‌తో దూసుకుపోతున్న తెలుగు సినిమా ఇండస్ట్రీలోని అగ్ర నిర్మాతలు, హీరోలు ఏపీలో స్టూడియోల నిర్మాణానికి ముందుకు రాకపోవడమే ఈ పరిస్థితికి కారణమనే విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుత సమాచారం ప్రకారం.. బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ అమరావతిలో అత్యాధునిక ఫిల్మ్ స్టూడియో కోసం, `పూజా ఎంటర్‌టైన్‌మెంట్స్` అధినేతలు ప్రొడక్షన్ హౌస్, డిజిటల్ ల్యాబ్స్ కోసం ఏపీ ప్రభుత్వంతో చర్చలు జరిపారు. వీరితో పాటు భారతదేశపు దిగ్గజ సంస్థ `టీ-సిరీస్` అధినేత భూషణ్ కుమార్ మ్యూజిక్ అకాడమీ, స్టూడియో కాంప్లెక్స్ ఏర్పాటుకు ఆసక్తి చూపించగా, యశ్ రాజ్ ఫిలిమ్స్ లేదా పివిఆర్-ఐనాక్స్ వంటి ముంబై కార్పొరేట్ స్టూడియో లైన్ల ప్రతినిధులు కూడా అమరావతిని భవిష్యత్తు సినీ హబ్‌గా మార్చే ప్రతిపాదనలను ముందుకు తెచ్చారు. మరోవైపు అజయ్ దేవగన్‌కు చెందిన కంపెనీ, కరణ్ జోహార్‌కు చెందిన `ధర్మా ప్రొడక్షన్స్` వంటి బాలీవుడ్ సంస్థలు ఇప్పటికే స్థిరపడిన హైదరాబాద్ సినీ హబ్‌లో కూడా తమ పెట్టుబడులను విస్తరించడానికి లీజుల కోసం సంప్రదింపులు జరుపుతున్నాయి.
అమరావతిలో సినిమా స్టూడియోల నిర్మాణానికి ముంబై ప్రతినిధులు భూములు కోరుతున్న తరుణంలో ఏపీ ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో అత్యంత పారదర్శకంగా, కఠినంగా వ్యవహరిస్తూ టాలీవుడ్ వర్గాలకు కూడా ఒక రకమైన హెచ్చరిక లాంటి సందేశాన్ని పంపింది. కేవలం సినీ సెలబ్రిటీల పేరు- ప్రాపకం, బ్రాండ్ ఇమేజ్ చూసి విలువైన రాజధాని భూములను కేటాయించడం కుదరదని ప్రభుత్వం స్పష్టం చేసింది. స్టూడియోల ఏర్పాటుకు ముందుకు వచ్చే ప్రతి సంస్థ తమ ఫైనాన్సియల్ షీట్స్, బ్యాలెన్స్ షీట్లను తప్పనిసరిగా సమర్పించాలని రూల్ పెట్టింది. వారి నిజమైన ఆర్థిక సామర్థ్యం పరిశీలించాకే భూములు కేటాయించనున్నట్టు వెల్లడించిందట.
మన స్వంత రాష్ట్ర రాజధానిలో తెలుగు సినీ పెద్దలు పెట్టుబడులు పెట్టడానికి వెనుకాడటం వల్లే.. ముంబై కార్పొరేట్ సంస్థలు బ్యాలెన్స్ షీట్లతో సహా వచ్చి అమరావతిలో అవకాశాలను చేజిక్కించుకోవడానికి ప్రయత్నిస్తున్నాయనే వాస్తవం టాలీవుడ్‌కు కొంత సిగ్గుచేటైన విషయమేనని విశ్లేషకులు భావిస్తున్నారు.







































