Loading...
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Twisha Sharma ex-judge mother-in-law demanded ₹2Lc

రిటైర్డ్ జడ్జి కట్నం డిమాండ్.. నటి కేసులో సీబీఐ

Twisha Sharma ex-judge mother-in-law demanded ₹2Lc

 

భారతీయ చలనచిత్ర రంగాన్ని కుదిపేసిన నటి ద్విషా శర్మ అనుమానాస్పద మృతి కేసు రోజురోజుకూ మరిన్ని మలుపులు తిరుగుతోంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసు దర్యాప్తును కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) అధికారికంగా తన చేతుల్లోకి తీసుకుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశాల మేరకు సీబీఐ సోమవారం ఈ కేసులో సరికొత్తగా ఎఫ్‌ఐఆర్ (ఎఫ్‌.ఐ.ఆర్) నమోదు చేసింది. గతంలో మధ్యప్రదేశ్ హైకోర్టు పరిధిలో సాగిన పలు చట్టపరమైన పోరాటాల అనంతరం, కేసు తీవ్రతను బట్టి సుప్రీంకోర్టు ఈ విచారణను కేంద్ర సంస్థకు అప్పగించింది.

ఈ కేసులో ద్విషా శర్మ భర్త సమర్థ్ సింగ్‌తో పాటు త‌న‌ అత్తగారు, మాజీ జిల్లా న్యాయమూర్తి అయిన గిరిబాలా సింగ్‌లను ప్రధాన నిందితులుగా సీబీఐ పేర్కొంది. గతేడాది డిసెంబర్‌లో సమర్థ్ సింగ్‌తో ద్విషా శర్మ వివాహం జరిగినట్లు సమాచారం. అయితే పెళ్లి ముగిసి అత్తగారింటికి పంపే `విదాయి` సమయంలో మాజీ జడ్జి గిరిబాలా సింగ్ అదనంగా రూ.2 లక్షల కట్నం డిమాండ్ చేశారనే బలమైన ఆరోపణను సీబీఐ తన ఎఫ్‌ఐఆర్‌లో పొందుపరిచింది. నిందితులపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)లోని సెక్షన్లు 80(2), 85, 3(5) లతో పాటు కట్న నిషేధ చట్టం కింద కేసులు నమోదయ్యాయి.

మరోవైపు ఈ కేసును గతంలో విచారించిన మధ్యప్రదేశ్ పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందం (ఎస్.ఐ.టి) నిందితుడు సమర్థ్ సింగ్‌ను మూడు గంటలకు పైగా విచారించింది. ఘటనా స్థలాన్ని రీ-క్రియేట్ చేసిన పోలీసులకు సమర్థ్ పలు విషయాలు చెప్పి తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడు. ద్విషా శర్మ గర్భం దాల్చిన విషయం తెలిసినప్పటి నుంచే తమ వైవాహిక బంధం దెబ్బతిందని.. గర్భస్రావం జరిగిన తర్వాత ఆమె తీవ్ర మనస్తాపానికి గురైందని అతడు వాదించాడు. తాను ద్విషాకు రూ.7 లక్షలు ఇచ్చానని క్లెయిమ్ చేసిన సమర్థ్ కేసు నమోదైన తర్వాత పరారవ్వడంపై అధికారులకు పొంతన లేని సమాధానాలు ఇచ్చాడు. దర్యాప్తులో భాగంగా పోలీసులు అతడి ల్యాప్‌టాప్, ఫోన్ ఇతర ముఖ్యమైన గుర్తింపు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

ద్విషా శర్మ కుటుంబ సభ్యులు పోలీసులకు ఇచ్చిన స్టేట్‌మెంట్ ప్రకారం.. మరణించిన రోజు రాత్రి 9:41 గంటల సమయంలో ద్విషా తన తల్లితో ఫోన్లో మాట్లాడింది. ఆ సమయంలో బ్యాక్‌గ్రౌండ్‌లో ఆమె భర్త సమర్థ్ గట్టిగా అరుస్తున్న శబ్దాలు వినిపించాయని.. ఆ వెంటనే ఫోన్ కాల్ హఠాత్తుగా కట్ అయిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఆ తర్వాత ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తలేదని.. చివరకు అత్త గిరిబాలా సింగ్ ఫోన్ ఎత్తి ``ఆమె ఇక లేదు`` అని చెప్పి నిర్దయ‌గా కాల్ కట్ చేసిందని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు ``మరణించిన కుమార్తె కంటే విడాకులు తీసుకున్న కుమార్తె మేలు`` అనే ఆవేదనను వ్యక్తం చేస్తూ విచారణను సీబీఐకి అప్పగించింది.

Twisha Sharma Case