Loading...
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Michael Jackson backstabbed me, says Ram Gopal Varma

పాప్ ఐకాన్ పై వ‌ర్మ కోపం.. ద్వేషం!

 

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎలాంటి వ్యాఖ్యలు చేసినా అందులో  వైవిధ్యం ఉంటుంది. ప్రపంచ పాప్ ఐకాన్ మైఖేల్ జాక్సన్ కు ఆర్జీవీ ఎంతటి పెద్ద అభిమానో అందరికీ తెలిసిందే. తాజాగా మైఖేల్ జాక్సన్ నిజ జీవిత ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ చూసిన వర్మ తీవ్రమైన భావోద్వేగానికి లోనయ్యారు. ఆ సినిమా చూసిన తర్వాత ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందించారు. `నేను మైఖేల్ జాక్సన్‌ను ద్వేషిస్తున్నాను` అంటూ సంచలన వ్యాఖ్యలు చేయడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ ద్వేషం వెనుక ఆయనపై ఉన్న  తీవ్రమైన ఆరాధన, ఎమోషన్ దాగి ఉన్నట్లు క‌నిపిస్తుంది.

మైఖేల్ జాక్సన్ మేనల్లుడు జాఫర్ జాక్సన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ బయోపిక్ పాప్ కింగ్ జీవితంలోని చీకటి కోణాలను, ఆయన అనుభవించిన మానసిక క్షోభను, ఒంటరితనాన్ని వెండితెరపై ఎంతో హృదయవిదారకంగా ఆవిష్కరించింది. ఈ చిత్రాన్ని వీక్షించిన ఆర్జీవీ.. మైఖేల్ జాక్సన్ అంతటి గొప్ప స్థాయికి ఎదిగే క్రమంలో అనుభవించిన నరకాన్ని, చుట్టూ ఉన్న ప్రపంచం ఆయనను వాడుకున్న తీరును చూసి తట్టుకోలేకపోయానని పేర్కొన్నారు. జాక్సన్ పట్ల సమాజం ప్రదర్శించిన క్రూరత్వం తనను ఎంతగానో కలచివేసిందని, అందుకే ఆయన జీవితాన్ని ఇంతలా కళ్లముందుంచిన  సినిమా చూశాక మైఖేల్ జాక్సన్‌పై తనకు ఒక రకమైన కోపం, ద్వేషం కలిగాయని ఎమోషనల్ అయ్యారు.

సాధారణంగా ఎవరికీ లొంగని, భావోద్వేగాలకు దూరంగా ఉండే రామ్ గోపాల్ వర్మ లాంటి దర్శకుడు ఒక సినిమా చూసి ఇంతలా రియాక్ట్ అవ్వడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఒక గొప్ప కళాకారుడి అంతర్గత సంఘర్షణను , కీర్తి వెనుక ఉన్న అసలు విషాదాన్ని  బయోపిక్ ఎంత పర్‌ఫెక్ట్‌గా క్యాప్చర్ చేసిందో ఆర్జీవీ స్పందన నిరూపిస్తోంది. నెటిజన్లు సైతం ఆర్జీవీ వ్యాఖ్యలపై స్పందిస్తూ నిజమైన ఆరాధన ఉన్నవారే ఆ పాప్ లెజెండ్ అనుభవించిన వేదనను చూసి అంతలా కలత చెందగలరని అభిప్రాయపడుతున్నారు. 

RGV,Michael Jackson backstabbed me, says Ram Gopal Varma