గ‌జ‌గ‌జ‌లాడిస్తున్న కొత్త `ఐబొమ్మ‌`

తెలుగు చలనచిత్ర పరిశ్రమను దశాబ్దాలుగా వేధిస్తున్న పైరసీ భూతం సరికొత్త టెక్నాలజీతో మళ్లీ పంజా విసిరింది. గతంలో సైబర్ క్రైమ్ పోలీసులు పకడ్బందీగా అడ్డుకుని మూయించేసిన టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ పైరసీ సైట్ ఐబొమ్మ (iBomma) ఇప్పుడు సరికొత్త డొమైన్‌తో.. `బప్పం టీవీ`తో జతకలిసి మళ్లీ పుట్టుకొచ్చింది. థియేటర్లలో విడుదలైన కొన్ని గంటల్లోనే కొత్త సినిమాలు, ఓటీటీ కంటెంట్‌ను అక్రమంగా స్ట్రీమింగ్ చేస్తుండటంతో తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేసింది.

ఫిలిం ఛాంబర్ యాంటీ వీడియో పైరసీ సెల్ ప్రాజెక్ట్ హెడ్ యర్రా మణీంద్ర బాబు ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. `వాట్ ఈజ్ రివ్యూస్ బ్లాగ్ స్పాట్ డాట్ కాం`, `ఐబొమ్మమీడియా డాట్ కాం` వెబ్‌సైట్ల నిర్వాహకులపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఈ ముఠా చట్టాల కంటికి చిక్కకుండా గూగుల్ బ్లాగ్‌స్పాట్‌ను వాడుకుంటూ.. సైబర్ పోలీసులు ట్రాక్ చేయలేని విధంగా యాంటీ-ట్రాకింగ్, యాంటీ-డీబగ్గింగ్ కోడింగ్ మెకానిజమ్‌లను పొందుపరచడం చూస్తే.. ఈ డిజిటల్ దొంగతనాన్ని అణచివేయడం సులువు కాద‌ని టాలీవుడ్ బెంబేలెత్తుతోంది.

సినిమాల దొంగతనంతో పాటు సమాజానికి, ముఖ్యంగా యువతకు తీవ్ర హాని కలిగించే మరో ప్రమాదకరమైన బెట్టింగ్ వెబ్ సైట్ల‌ను ఇవి ప్రోత్స‌హిస్తుండ‌డం మ‌రింత‌ హానిక‌రంగా మారింది. ఉచితంగా సినిమాలను ఆశగా చూపిస్తూనే వాటి వెనుక దేశంలో నిషేధించబడిన 1xBet, 4rabet వంటి ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్, బెట్టింగ్ అప్లికేషన్లను విపరీతంగా ప్రమోట్ చేస్తున్నారు. ఉచిత సినిమాల పేరిట యువతను ఆన్‌లైన్ జూదం ఊబిలోకి లాగి వారి జీవితాలను గుల్ల చేసే పెద్ద కుట్ర ఇందులో దాగి ఉంది.

ఈ తీవ్రతను గమనించిన సైబర్ క్రైమ్ పోలీసులు ఐటీ యాక్ట్, బీఎన్ఎస్, తెలంగాణ గేమింగ్ యాక్ట్‌తో పాటు ఆన్‌లైన్ గేమింగ్ ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్-2025 కింద కఠిన సెక్షన్లతో దర్యాప్తు ముమ్మరం చేశారు. సినీపరిశ్ర‌మ‌కు వేల‌కోట్ల న‌ష్టాల‌ను మిగుల్చిన ఐబొమ్మ మ‌ళ్లీ వ‌చ్చింది అన‌గానే హైద‌రాబాద్ బీటెక్ బాబులతో పాటు ఇరు రాష్ట్రాల్లోని ప్ర‌జ‌లలో పండ‌గ చేసుకుంటున్నవాళ్లు ఉన్నారు.
 

Tollywood,Tollywood Piracy Issue Resurfaces