జర్నలిస్ట్ గా సక్సెస్ అయినా? నటుడిగా ఫెయిల్!

నెట్‌ఫ్లిక్స్ వేదికగా తాజాగా విడుదలైన క్రైమ్ డ్రామా `కర్తవ్య` సోషల్ మీడియాలో విపరీతమైన చర్చకు దారితీసింది. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించినా ఒక నటుడు మాత్రం నెటిజన్ల తీవ్ర విమర్శలకు గురవుతున్నారు. ప్రముఖ హిందీ డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్ `లల్లన్‌టాప్` మాజీ ఎడిటర్, సీనియర్ జర్నలిస్ట్ సౌరభ్ ద్వివేది ఈ చిత్రం ద్వారా నటుడిగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. అయితే ఆయన తొలి ప్రయత్నం ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేకపోవడంతో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్ వేదికగా దారుణమైన ట్రోలింగ్ మొదలైంది.
ఈ చిత్రంలో పవర్‌ఫుల్ ఆధ్యాత్మిక సంస్థకు అధిపతి అయిన ఆనంద్ శ్రీ అనే నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో సౌరభ్ ద్వివేది నటించారు. కానీ ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ , డైలాగ్ డెలివరీ సినిమా డ్రామాకు తగ్గట్లుగా కాకుండా ఒక న్యూస్ బ్రాడ్‌కాస్టింగ్ లాగా ఉందంటూ నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. యాక్టింగ్‌ను యాంకరింగ్‌లా భావించారా అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేయగా, ఆయన నటన మరీ దారుణంగా ఉండటం వల్లే క్లైమాక్స్ సీన్ కూడా కట్ చేశారంటూ రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. `దీనికంటే కేఆర్కే ఇంకా బాగా నటిస్తాడు` అంటూ కొందరు మీమర్స్ ద్వివేది హావభావాలపై ఫన్నీ మీమ్స్ షేర్ చేస్తున్నారు.
ఈ ట్రోలింగ్ ఏ స్థాయికి చేరిందంటే? బాలీవుడ్‌లో తరచూ నటన పరంగా విమర్శలు ఎదుర్కొనే అర్జున్ కపూర్ పేరును కూడా నెటిజన్లు ఇందులోకి లాగారు. సౌరభ్ ద్వివేది నటనతో పోలిస్తే `అర్జున్ కపూర్ 10 రెట్లు బెటర్` అంటూ కొందరు ఘాటుగా కామెంట్లు పెడుతున్నారు. రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించిన ఈ గ్రిప్పింగ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌లో సైఫ్ అలీ ఖాన్ నటనకు మంచి మార్కులు పడినా? కీలక పాత్రలో సౌరభ్ ద్వివేదిని ఎంపిక చేయడం సినిమాకు మైనస్‌గా మారిందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. జర్నలిజంలో తన బేబాక్ శైలితో ఆకట్టుకున్న సౌరభ్ నటనలో మాత్రం తొలి అడుగులోనే తీవ్ర నిరాశను మిగిల్చారు.






































