దర్శకుడి విజన్ - ఎడిటర్ కత్తెర ఎలా పనిచేస్తాయి

సినిమా అనేది ప్రధానంగా దర్శకుడి విజన్ అయినా? ఎడిటర్ ఆ విజన్‌కు ఒక స్పష్టమైన రూపాన్ని ఇచ్చే ద్వితీయ దర్శకుడు. దర్శకుడు తన కలని తెరపైకి తీసుకురావడానికి ఎంతో శ్రమించి ప్రతి సన్నివేశాన్ని చిత్రీకరిస్తారు. అందుకే ఆయనకు ప్రతి షాట్ ఎంతో విలువైనదిగా అనిపిస్తుంది. అయితే ఎడిటర్ ఒక తటస్థ ప్రేక్షకుని కోణంలో సినిమాను చూస్తారు. కేవలం కథా గమనాన్ని వేగవంతం చేయడానికి భావోద్వేగాలను పండించడానికి అవసరం లేని దృశ్యాలను తొలగించడం ఎడిటర్ బాధ్యత. ఈ క్రమంలో ఎడిటర్ వేసే కత్తెర దర్శకుడి సృజనాత్మకతకు అడ్డంకి కాదు. అది సినిమాను మరింత పదునుగా మార్చే ప్రక్రియ.
దర్శక-ఎడిటర్ల మధ్య ఉండే సమన్వయం సినిమా విజయానికి అత్యంత కీలకం. దర్శకుడు ఒక సన్నివేశం గొప్పగా వచ్చిందని భావించినా? అది సినిమా నిడివిని పెంచి ప్రేక్షకుడికి విసుగు కలిగిస్తుందని ఎడిటర్ భావించొచ్చు. ఇలాంటి సమయాల్లో ఎడిటర్ జోక్యం సమంజసమే కాదు అత్యవసరం కూడా. ఎడిటర్ కేవలం ఫుటేజీని కత్తిరించే వ్యక్తి మాత్రమే కాదు. సినిమాలోని లయను , మూడ్‌ను నియంత్రించే కీలక శక్తి. దర్శకుడి భావజాలానికి, ఎడిటర్ సాంకేతిక విశ్లేషణ తోడైనప్పుడే గొప్ప ఔట్ పుట్ వస్తుంది.
ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు సినిమా నాణ్యత దెబ్బతినే ప్రమాదం కచ్చితంగా ఉంటుంది. దర్శకుడు తన పంతానికి పోయి అనవసరమైన సన్నివేశాలను ఉంచితే సినిమా మందకొడిగా తయారవుతుంది. అలాగే ఎడిటర్ కథలోని ఆత్మను అర్థం చేసుకోకుండా కత్తెర వేస్తే ఎమోషన్ దెబ్బతింటుంది. అందుకే గొప్ప సినిమాలు ఎప్పుడూ ఇద్దరి మధ్య జరిగే ఆరోగ్యకరమైన చర్చల నుండి పుడతాయి. ఇద్దరి మధ్య సృజనాత్మక ఘర్షణ’ ఉంటేనే అది సినిమాను మెరుగు పరుస్తుంది. కానీ వ్యక్తిగత విభేదాలుగా మారితే మాత్రం అది సినిమా ఫలితాన్ని తారుమారు చేస్తుందన్నది అంతే వాస్తవం.






































