బాల‌య్య‌తో అత‌డా ఊహ‌కి కూడా రాలేదే!

ఇండ‌స్ట్రీలో అప్పుడ‌ప్పుడు ఊహించ‌ని కాంబినేష‌న్లు క‌లుస్తుంటాయి. తాజాగా అలాంటి కాంబినేష‌న్ ఒక‌టి సెట్ అవుతున్నట్లు తెలుస్తోంది. సున్నితమైన భావోద్వేగాలకు, స్వచ్ఛమైన ప్రేమకథలకు కేరాఫ్ అడ్రస్ అయిన దర్శకుడు శేఖర్ కమ్ముల న‌ట‌సింహ  బాలకృష్ణతో ఓ  భారీ ప్రాజెక్టు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. సున్నితత్వం కలిగిన కమ్ముల మేకింగ్, హై-వోల్టేజ్ యాక్షన్‌కు ప్రాధాన్యతనిచ్చే బాలయ్య బాడీ లాంగ్వేజ్.
ఈ రెండు భిన్న ధృవాలు ఒకే చోట చేరితే ఎలా ఉంటుందనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. బాలయ్యలోని నటుడిని ఓ కొత్త కోణంలో, క్లాస్ టచ్‌తో చూపించేలా ఓ స్టోరీ సిద్దం చేస్తున్నారుట‌. ఇప్పుడీ వార్త ఆస‌క్తిక‌రంగా  మారింది. ఈ అరుదైన కలయికపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మాస్ ఇమేజ్ ఉన్న హీరోతో రియలిస్టిక్ డ్రామా తీయడం  సాహసోపేతమైన ప్రయత్నమని కొంద‌రంటున్నారు.
రజనీకాంత్ - పా రంజిత్ కాంబినేషన్ తరహాలో రెగ్యులర్ కమర్షియల్ ఫార్ములాను బ్రేక్ చేస్తూ బాలయ్య ఇమేజ్‌కు తగ్గట్టుగా విలక్షణమైన పాత్రను కమ్ముల డిజైన్ చేస్తున్నారట. `అన్‌స్టాపబుల్` షో ద్వారా బాలయ్యలోని సహజత్వాన్ని ప్రేక్షకులు చూసి ఉండటంతో శేఖర్ కమ్ముల మార్కు టేకింగ్‌లో బాల‌య్య  పర్ఫార్మెన్స్ మరో స్థాయిలో ఉంటుందని అంచనా వేస్తున్నారు.
అయితే ఈ క్రేజీ కాంబినేషన్ పట్టాలెక్కడం అంత సులభం కాదు.  బాలయ్య మాస్ అప్పీల్‌ను దెబ్బతీయకుండా? తనదైన సహజమైన శైలిని వదులుకోకుండా కమ్ముల స్క్రిప్ట్‌ను ఎలా మలుస్తారనేది పెద్ద ఛాలెంజ్. ప్రస్తుతం బాలయ్య వరుస మాస్ చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఈ గ్యాప్‌లో స్క్రిప్ట్ పనులు పూర్తైతే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. 

Sekhar Kammula to direct Balakrishna?Balakrishna - Sekhar Kammula