బాలీవుడ్ నటి శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రా కు బాంబే హైకోర్టు మొట్టికాయలు వేసింది. చీటింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శిల్ప శెట్టి-రాజ్ కుంద్రాలు విదేశాలకు పారిపోకుండా లుకౌట్ నోటీసులు జారి చేసింది బాంబే కోర్టు. ఓ బిజినెస్ మ్యాన్ ను రూ.60 కోట్లు మోసం చేశారన్న కేసులో శిల్పాశెట్టి దంపతులకు కోర్టు ఝలక్ ఇచ్చింది.
అయితే శిల్పాశెట్టి, దంపతులు ఓ ఈవెంట్ కోసం శ్రీలంక వెళ్లాల్సి వచ్చి కోర్టులో పిటిషన్ వేశారు. తమకు అక్టోబరు 25 నుంచి 29 వరకు శ్రీలంక కొలంబో వెళ్లాల్సి ఉంది. కానీ లుకౌట్ నోటీసులు అమల్లో ఉండటంతో, తాము ప్రయాణానికి అనుమతి కోరుతూ హైకోర్టును ఆశ్రయించగా కోర్టు ముందు రూ.60 కోట్లు డిపాజిట్ చేసి అప్పుడు వేరే దేశానికి వెళ్ళమని తీర్పునిచ్చింది.
అంతేకాకుండా కొలంబో ఈవెంట్ కు ఈవెంట్ నిర్వాహకుల నుంచి మీకు అధికారిక ఆహ్వానం ఏమైనా ఉందా అని శిల్పాశెట్టి దంపతులను హైకోర్టు ప్రశ్నించగా.. ప్రస్తుతం ఫోన్ కాల్ ద్వారా మాత్రమే సమాచారం ఇచ్చారని, కోర్టు అనుమతి ఇస్తే అధికారిక ఆహ్వానం వస్తుందని శిల్పాశెట్టి న్యాయవాది తెలిపారు. ఏది ఏమైనా ఆ రూ.60 కోట్ల డిపాజిట్ కట్టాకే వారు విదేశాలకు వెళ్లొచ్చని కోర్టు తీర్పునిచ్చింది.