కొన్నేళ్ల క్రితం అమీర్ ఖాన్ తన రెండో భార్య కిరణ్ రావు నుంచి విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించగానే అందరూ షాకైన సంగతి తెలిసిందే. అమీర్ ఖాన్ దంగల్ నటి ఫాతిమా సనా షేక్ తో ఎఫైర్ సాగిస్తుండటం వల్లనే రెండో భార్యకు విడాకులిస్తున్నాడని చాలా మాట్లాడుకున్నారు.
అయితే ఇప్పుడు కిరణ్ రావుతో మనస్ఫర్థల గురించి అమీర్ ఖాన్ ఓపెనయ్యాడు. తనవైపు నుంచి ఎలాంటి తప్పు ఉందో చెప్పుకొచ్చాడు. తనను ఎవరైనా మానసికంగా గాయపరిస్తే, చుట్టూ షట్టర్లు మూసుకుపోయినట్టు భావిస్తానని, త్వరగా దాని నుంచి బయటపడలేనని అమీర్ ఖాన్ అన్నాడు. కిరణ్ రావుతో ఏదో ఒక విషయంలో మనసుకు గాయమైంది. ఆ తర్వాత అతడు తనతో మాట్లాడటం మానేసాడు. నాలుగు రోజుల పాటు మాట్లాడకపోయేసరికి కిరణ్ రావు చాలా కన్నీటిపర్యంతమైంది. తాను చాలాసార్లు మాట్లాడేందుకు ప్రయత్నించేది. కానీ నేను కట్ చేసేవాడిని. అలా నాలుగు రోజులు గడిపాను.. అని అమీర్ ఖాన్ గుర్తు చేసుకున్నాడు.
అయితే అలా మనసు విప్పి సమస్య ఏమిటో మాట్లాడుకునే అలవాటు లేకపోవడం వల్లనే విడిపోయామని కూడా అమీర్ చెప్పుకొచ్చాడు. భార్యా భర్తల నడుమ అనుబంధం నిలవాలంటే, ఏది ఉన్నా ఇద్దరూ మనసు విప్పి మాట్లాడుకోవాలని లైఫ్ కోచ్ లు చెబుతుంటారు. కానీ ఈ విషయంలో సూపర్‌స్టార్ విఫలమయ్యాడు.