ఇండియాలో అత్యంత ధనికుడైన ఫిలింమేకర్ ఎవరు? అంటే .. ఈ ప్రశ్నకు నిస్సందేహంగా కరణ్ జోహార్ పేరును ఖరారు చేసింది పాపులర్ హురూన్ లిస్ట్ 2025. దాదాపు 1880 కోట్ల నికర ఆస్తులతో కరణ్ జోహార్ జాబితాలో టాప్ 4 స్థానంలో నిలవగా, ఈ జాబితాలో స్టార్ హీరో షారూఖ్ 12,490కోట్లతో నంబర్ వన్ గా నిలిచారు. నంబర్ 2గా జూహీచావ్లా(7,790 కోట్లు), నంబర్ 3గా హృతిక్ (2,160కోట్లు), ఐదో సెలబ్రిటీగా అమితాబ్ బచ్చన్ (1630 కోట్లు) రికార్డులకెక్కారు.
దశాబ్ధాలుగా కరణ్ ధర్మ ప్రొడక్షన్స్ ని నిలబెట్టేందుకు చాలా శ్రమించారు. ఈ బ్యానర్ ఇటీవలి కాలంలో కళ తప్పిన సంగతి తెలిసిందే. కొన్నేళ్లుగా పెద్ద హీరోలతో సినిమాలేవీ సరైన విజయాల్ని సాధించలేదు. పెద్ద హీరోలు పెద్ద పారితోషికాలతో ఇబ్బందులున్నాయని కరణ్ బహిరంగంగా ప్రకటించాడు. కారణం ఏదైనా ధర్మ ప్రొడక్షన్స్ పెద్ద హీరోలతో సినిమాలను ఆపేసింది.
బ్యానర్ ఆదాయం పడిపోయినా కానీ, కరణ్ సుదీర్ఘ కాలంగా ఎన్నో బ్లాక్ బస్టర్లను అందించడంతో ధర్మ సంస్థ ఈ జాబితాలో నిలబడగలిగింది. ఇటీవల కరణ్ ఆర్థిక భారాన్ని మోయలేక ఆధార్ పూనవల్లాకు తన సంస్థ నుంచి మెజారిటీ షేర్లను కట్టబెట్టారు. కరణ్ జోహార్ చిన్న వాటాతో వర్కింగ్ పార్టనర్ గా కొనసాగుతున్నారు.