గత 15 ఏళ్లలో ఒక్క సినిమాలో కూడా నటించలేదు. కానీ చాలా మంది అగ్ర కథానాయికలను మించిన నికర ఆస్తులతో ఈ ప్రముఖ నటి ఆశ్చర్యపరుస్తోంది. ఐశ్వర్యారాయ్, దీపిక, కత్రిన, ఆలియా .. వీళ్లలో ఎవరూ ఈ నటి దరిదాపుల్లో లేరు! హురూన్ ఇండియా -2025 ప్రకారం ఈ ప్రముఖ నటి నికర ఆస్తుల విలువ 7790కోట్లు. గత ఏడాది కేవలం 4600కోట్లుగా ఉన్న ఆస్తులు ఇప్పుడు ఇంత వేగంగా వృద్ధి చెందడం ఆశ్చర్యపరుస్తోంది. హురూన్ జాబితా ప్రకారం.. భారతదేశంలో అత్యంత సంపన్న కథానాయికగా ఈ సీనియర్ నటి రికార్డుల్లో స్థిరంగా కొనసాగుతోంది.
ఈ ప్రముఖ నటి ఎవరో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. నాగార్జున `విక్కీ దాదా` చిత్రంతో తెలుగు ప్రజలకు సుపరిచితమైన జూహీ చావ్లా గురించే ఇదంతా. తెలుగు, తమిళం, హిందీ చిత్రసీమల్లో దశాబ్ధం పైగానే అగ్ర కథానాయికగా ఏలిన జూహీ ఇటీవల సినిమాలకు దూరంగా కుటుంబ వ్యాపారాలతో బిజీగా ఉన్నారు.
జూహీ ఆమె భర్త జే మెహతా వ్యాపార రంగలో నిష్ణాతులు. కింగ్ ఖాన్ షారూఖ్ తో కలిసి రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్ మెంట్స్ లో భాగస్వాములు. అలాగే కోల్ కతా నైట్ రైడర్స్ సహయజమానులుగాను ఖాన్ తో కలిసి వ్యాపారాలు సాగిస్తున్నారు. ఇవేగాక రియల్ ఎస్టేట్ లోను భారీగా ఆర్జిస్తున్నారు. దేశ విదేశాలలో మెహతా కంపెనీలు భారీ రాబడితో పోర్ట్ పోలియోను పెంచుకుంటున్నాయి.