కింగ్ ఖాన్ షారూఖ్ వారసుడు ఆర్యన్ ఖాన్ దర్శకుడిగా ఆరంగేట్రం చేస్తున్న సంగతి తెలిసిందే. తన తొలి ప్రయత్నం ఒక వెబ్ సిరీస్ తో మొదలైంది. బాడ్స్ ఆఫ్ బాలీవుడ్ పేరుతో అతడు ఆరంభమే భారీ ప్రయోగం చేసాడు. తండ్రిలా స్టార్ అవ్వాలనుకోకుండా దర్శకుడిగా నిరూపించాలని అనుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆర్యన్ తన తొలి వెబ్ సిరీస్ ట్రైలర్ తో ఆకట్టుకున్నాడు.
ఈ బుధవారం నాడు (17 అక్టోబర్) ఈ వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అయింది. ఈ సందర్బంగా ముంబైలో జరిగిన పార్టీలో ఆర్యన్ ఖాన్ సహా పలువురు సెలబ్రిటీలు సందడి చేసారు. అయితే ఈ ఈవెంట్ లో ఆర్యన్ ఎప్పటికీ షోస్టాపర్ గా నిలవలేదు. ఆర్యన్ స్నేహితుడే అయిన స్టాండప్ కమెడియన్ సమయ్ రైనాపై అందరి కళ్లు నిలిచాయి. దానికి కారణం అతడు ధరించిన టీషర్ట్ పై ఉన్న వివాదాస్పద కొటేషన్. ``సే నో టు క్రూయిజ్!`` అనే సింపుల్ కొటేషన్ అతడు ధరించిన టీషర్ట్ పై రాసి ఉంది.
ఆ కొటేషన్ ఉద్ధేశం ఏదైనా కానీ, ఇది ఆర్యన్ ఖాన్ క్రూయిజ్ షిప్ పార్టీలో అరెస్ట్ వ్యవహారాన్ని మరోసారి గుర్తు చేసింది. క్రూయిజ్ షిప్ లో ఇక పార్టీలు వద్దు! అనే వ్యంగ్యమైన కొటేషన్ ఇది. సూటిగా ఆర్యన్ ఖాన్ ని అరెస్ట్ చేసిన సమీర్ వాంఖడే అనే నార్కోటిక్స్ అధికారిని టార్గెట్ చేయడమేనని అందరూ భావిస్తున్నారు. ఆర్యన్ తన తప్పు లేదని కోర్టులో నిరూపించుకుని నిజమైన హీరోగా బయటపడ్డాడు. అలాంటప్పుడు సమీర్ వాంఖడే తప్పుడు కేసులో ఇరికించాడనే అర్థం వచ్చేలా ఇప్పుడు పార్టీలో హింట్ ఇచ్చారా? అన్న చర్చ వేడెక్కిస్తోంది. తాను తప్పు చేయకపోయినా తనను అరెస్ట్ చేసారని, ఇది ఎక్కడి న్యాయం? అని సమీర్ వాంఖడేను ఆర్యన్ ఖాన్ ఇంతకుముందు ప్రశ్నించారు. వీలున్న ప్రతి వేదికపైనా అతడు తన స్నేహితుల సాయంతో పంచ్ లు వేస్తున్నాడని భావించాలి.