ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా అంటూ దాసరి తర్వాత ఎవరు లేకపోయినా.. ఆ స్థానాన్ని మెగాస్టార్ చిరు స్వీకరించకపోయినా.. చిన్న హీరోలు, కుర్ర హీరోలు, నటులు ఇలా అందరూ చిరు ని తెలుగు సినిమా ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగానే భావిస్తుంటారు. చిరు నేను ఎలాంటి పెద్దరికం తీసుకోకపోయినా పెద్దన్న గా ఆయన పలు సమస్యల పరిష్కారానికి ఆయన కృషి చేస్తూ ఉంటారు. అంతేకాదు అభిమానులైనా, ఎవ్వరైనా సహాయం కోరి వస్తే కాదనకుండా చేస్తారు.
బ్లడ్ బ్యాంక్ ఇలా పలు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలతో అభిమానులకే కాదు ప్రజలకు మంచి చేసే మెగాస్టార్ రెండు తెలుగు రాష్ట్రాలకు ఏదైనా విపత్తు వచ్చినా, లేదా ఇంకేదైనా సహాయం చెయ్యాలన్నా అందరికన్నా ముందు ఉంటారు. గత ఏడాది వరదల కారణంగా అతలాకుతలమైన ఏపీని ఆదుకునేందుకు చిరు తనవంతు సహాయం చేసారు.
ఇప్పుడు మరోమారు మెగాస్టార్ తన దాతృత్వాన్ని చాటుకున్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ కోసం మెగాస్టార్ చిరంజీవి కోటి రూపాయల చెక్కుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని కలిసి ఆయనకు అందించడం చూసిన వారు మెగాస్టార్ దానగుణాన్ని, దాతృత్వాన్ని పొగడకుండా ఉండలేకపోతున్నారు.