దాదాపు మూడు వారాలుగా తెలుగు చిత్రసీమ నిరవధిక కార్మిక సమ్మెతో స్థంభించిపోయిన సంగతి తెలిసిందే. షూటింగులు ఎక్కడిక్కడ నిలిచిపోవడంతో నిర్మాతలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. 30శాతం వేతన సవరణ డిమాండ్ పరిష్కారం కాకపోవడంతో కార్మికులు మెట్టు దిగలేదు. మెగాస్టార్ చిరంజీవి, దిల్ రాజు సహా సినీపెద్దలు ఫెడరేషన్ తో సుదీర్ఘంగా చర్చలు జరిపినా అవి సత్ఫలితాన్ని ఇవ్వలేదు.
ఎట్టకేలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవతో కార్మిక సమ్మె సమస్య పరిష్కారమైంది. ఈ గురువారం సాయంత్రం సమ్మె విరమిస్తున్నట్టు ఫెడరేషన్ అధికారికంగా ప్రకటించింది. శుక్రవారం (నేటి) నుంచి టాలీవుడ్ లో యథావిధిగా షూటింగులు ప్రారంభమయ్యాయి. అయితే కార్మికుల డిమాండ్ మేరకు 30శాతం పెంపు సాధ్యం కాలేదు. మొదటి సంవత్సరం 22.5 శాతం పెంపు వర్తిస్తుంది. అంటే 15శాతం పెంపును అమల్లోకి తెస్తారు. రెండో సంవత్సరం మరో 2.5 శాతం పెంపును అమలు చేస్తారు.అలాగే మూడో సంవత్సరం 5శాతం పెంపు అమలవుతుంది. దీంతో పాటు అదనంగా కార్మికుల నుంచి వచ్చిన కొన్ని డిమాండ్ల అమలుకు నిర్మాతలు అంగీకరించారు. ఆ మేరకు నిర్మాతలు ఫెడరేషన్ తో ఒప్పందంపై సంతకం చేసారు.
పరిశ్రమలో తక్కువ భత్యం ఉన్న చాలా మంది కార్మికుల సమస్యలేమిటన్నదానిపై ప్రిన్సిపల్ సెక్రటరీ సమక్షంలో ఒక కమీషన్ కూడా పని చేయనుంది. ఇది నెలరోజుల లోపు తమ రిపోర్ట్ ను ప్రభుత్వానికి అందజేయనుంది. 18 రోజుల నిరవధిక సమ్మెకు ముగింపు పలకడంతో పరిశ్రమలో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
ముఖ్యమంత్రి రేవంత్ చొరవ తీసుకుని సమస్యను సామరస్యంగా పరిష్కరించినందుకు మెగాస్టార్ చిరంజీవి, తెలంగాణ ఎఫ్ డిసి అధ్యక్షుడు దిల్ రాజు సహా సినీపెద్దలు కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ క్లిష్ఠ సమయంలో లేబర్ కమీషన్ సహాయానికి కూడా పరిశ్రమ ధన్యవాదాలు తెలిపింది.