సినిమా సెట్లలో అసౌకర్యాలు, లైంగిక వేధింపులు సహా పలు అంశాలపై గతంలో మలయాళ చిత్రసీమ అధ్వాన్న స్థితి గురించి మీడియాలో సంచలన కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా మహిళల భద్రత ప్రశ్నార్థకంగా ఉందని, వారికి సౌకర్యాలు జీరో అని కూడా వెల్లడైంది. జస్టిస్ హేమ కమిటీ సంచలన నిజాలను బహిర్గతం చేసింది. ఈ శనివారం నాడు తిరువనంతపురంలో జరిగిన కేరళ ఫిల్మ్ పాలసీ కాన్‌క్లేవ్‌ను ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఫిల్మ్ పాలసీని ఖరారు చేసారని సమాచారం.
దీని ప్రకారం...ముసాయిదా సినిమా పాలసీపై చర్చలు ముగిసాయి. తుది నివేదిక ఆమోదించబడే అవకాశం ఉంది. అయితే ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ (WCC) , ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ కేరళ (FEFKA) మధ్య భిన్నాభిప్రాయాలు తలెత్తాయని తెలుస్తోంది. ఇప్పటికే సూచించినట్టు ప్రాథమిక కార్యాలయ సౌకర్యాలు అమల్లోనే ఉన్నాయని, ఫెఫ్కా ప్రతినిధులు పేర్కొన్నా కానీ మహిళా రక్షణ విభాగం ఈ వాదనపై అసంతృప్తి వ్యక్తం చేసింది. మాలీవుడ్ లో మరింత అర్థవంతమైన మార్పును తీసుకురావడానికి ప్రయత్నించాలని కోరింది.
ముసాయిదా విధానంలోని కీలక సిఫార్సులు:
*సినిమా సెట్లలో వివక్షత, లైంగిక వేధింపులు, అధికార దుర్వినియోగాన్ని ఖచ్చితంగా నిషేధించాలి. కాస్టింగ్ కౌచ్ పద్ధతిని పూర్తిగా నిర్మూలించాలి. జీరో-టాలరెన్స్ విధానాన్ని అమలు చేయాలి. వేధింపులు లేదా దుర్వినియోగంలో పాల్గొన్న నేరస్థులను పరిశ్రమ నుండి బ్లాక్ లిస్ట్ చేయాలి.
*ఆడిషన్లను నిర్వహించడానికి కేంద్రీకృత, పారదర్శక ప్రోటోకాల్‌ను అమలు చేయాలి. చిత్ర పరిశ్రమ అంతటా ఏకీకృత ప్రవర్తనా నియమావళిని ప్రవేశపెట్టి అమలు చేయాలి.
*క్లీన్ టాయిలెట్‌లు, నియమించిన విశ్రాంతి ప్రాంతాలు సహా ప్రాథమిక కార్యాలయ సౌకర్యాలు అన్ని సెట్‌లలో ఉండేలా చూసుకోవాలి.
*అన్ని నిర్మాణ ప్రదేశాలలో POSH (లైంగిక వేధింపుల నివారణ) చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేయాలి. సైబర్ పోలీసుల పరిధిలో ఒక ప్రత్యేక యాంటీ-పైరసీ సెల్ ఏర్పాటు చేయాలి.
*వేధింపులకు వ్యతిరేకంగా మాట్లాడే వ్యక్తులకు ప్రజా , పరిశ్రమ మద్దతు అందించాలి.
*సినిమా నిపుణులపై ఆన్‌లైన్ దుర్వినియోగం , లక్ష్యంగా చేసుకున్న సైబర్ దాడులను చురుకుగా నిరోధించాలి.
*సినిమా పరిశ్రమలోకి ప్రవేశించే కొత్తవారికి మార్గనిర్దేశం చేయడానికి , మద్దతు ఇవ్వడానికి మెంటర్‌షిప్ కార్యక్రమాలను ఏర్పాటు చేయాలి.