జేడీఎస్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను అత్యాచారం కేసులో కోర్టు దోషిగా తేల్చింది. ఇంట్లో పనిమనిషిపై అత్యాచారం కేసు, అలాగే బ్లాక్ మెయిల్ చేసిన కేసులో ప్రజ్వల్ రేవణ్ణకు కోర్టు పదేళ్లు శిక్ష విదిస్తుంది అనుకున్నారు. పదేళ్లు కాదు ప్రజ్వల్ రేవణ్ణకు బెంగళూరు ప్రత్యేక న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. దానితో పాటుగా ఐదు లక్షలు జరిమానా విధించింది. అంతేకాకుండా రూ.7లక్షలు బాధితురాలికి ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.
ప్రజ్వల్ రేవణ్ణ మాజీ ప్రధాని దేవగౌడ మనవడు. హసన్ లోని తన ఫాంహౌస్‌తో పాటు, అతని నివాసంలోనే పలుమార్లు బాధితురాలిపై అత్యాచారం చేసి, దానిని వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేసినట్టుగా బాధితురాలు ప్రజ్వల్ రేవణ్ణపై ఫిర్యాదు చెయ్యగా.. గత ఏడాది మే 21న అత్యాచారం కేసులో ప్రజ్వల్ రేవణ్ణను పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి ఆయన జైల్లోనే ఉన్నారు.
కేవలం పని మనిషిపై అత్యాచారం ఘటన మాత్రమే కాదు, ఎంపీ ప్రజ్వల్‌పై అశ్లీల వీడియోల కేసులు నమోదు అయ్యాయి. హసన్‌లోని ప్రజ్వల్ రేవణ్ణ ఫామ్‌హౌజ్ నుంచి 2,900 వీడియోలు ఉన్న పెన్‌డ్రైవ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకోవడం తీవ్రకలకలం రేపింది. ఇందుకుగానూ ప్రజ్వల్‌పై మూడు కేసులు నమోదు కాగా.. వాటిని సీఐడీ ఆధ్వర్యంలో సిట్ విచారణ జరుపుతోంది.
ఇప్పుడు అత్యాచారం కేసులో ప్రజ్వల్ రేవణ్ణకు బెంగళూరు ప్రత్యేక న్యాయస్థానం జీవితఖైదు విధించింది.