భారతీయ చిత్రపరిశ్రమలో టాప్ -10 యాక్షన్ హీరోల జాబితాను తిరగేస్తే, అందులో విద్యుత్ జమ్వాల్ పేరు కచ్ఛితంగా ఉండాల్సిందే. అతడి తీరైన శరీరాకృతి, మార్షల్ ఆర్ట్స్ నైపుణ్యాలకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. దళపతి విజయ్ కథానాయకుడిగా ఏ.ఆర్.మురుగదాస్ తెరకెక్కించిన తుపాకి (తుప్పాక్కి- తమిళం) చిత్రంలో విద్యుత్ జమ్వాల్ క్రూరుడైన విలన్ గా నటించాడు. అతడి నటనకు ప్రశంసలు కురిసాయి. బాలీవుడ్ లో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ తర్వాత మార్షల్ ఆర్ట్స్ నిపుణుడిగా అతడికి ప్రత్యేక గుర్తింపు ఉంది.
బాలీవుడ్ లో పలు బ్లాక్ బస్టర్ చిత్రాల్లోను అత్యుత్తమ నటనతో ఆకట్టుకున్నాడు జమ్వాల్. కమాండో ఫ్రాంఛైజీ చిత్రాలు, ఖుదా హఫీజ్, బాద్‌షాహో వంటి భారీ యాక్షన్ చిత్రాలలో అతడి మార్షల్ ఆర్ట్స్ నైపుణ్యం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. 44 ఏళ్ల విద్యుత్ జమ్వాల్ ఇప్పుడు స్ట్రీట్ ఫైటర్ అనే సినిమాతో హాలీవుడ్‌లోకి అడుగుపెట్టనున్నారు. స్టూడియో లెజెండరీ నుండి అదే పేరుతో వచ్చిన ప్రముఖ వీడియో గేమ్ ని స్ట్రీట్ ఫైటర్ పేరుతో సినిమాలుగా రూపొందిస్తున్నారు. ఇది 90ల కాలంలో మొదలైంది. స్ట్రీట్ ఫైటర్ 1987లో జపనీస్ కంపెనీ క్యాప్‌కామ్ నుండి ఆర్కేడ్ గేమ్‌గా ప్రారంభమైంది. 1991లో `స్ట్రీట్ ఫైటర్ 2`తో పాప్ సంస్కృతిలో ఉన్నత స్థాయికి చేరుకుంది. ఇది వన్-ఆన్-వన్ ప్లేయింగ్‌లో విప్లవాత్మక మార్పులు చేసింది.
ఈ తరహా ఆటలో ఆటగాళ్ళు ఒక పాత్రను, ప్రత్యేకమైన పోరాట శైలితో కూడిన మార్షల్ ఆర్టిస్ట్ లేదా ఫైటర్‌ను ఎంచుకుని ఫైట్ చేస్తారు. ప్రత్యర్థులను పంచ్‌లు, కిక్‌లు, ప్రత్యేక కదలికలు కాంబోలను ఉపయోగించి పోరాడతారు. ఈ గేమ్ తాజా ఎడిషన్ స్ట్రీట్ ఫైటర్ 6 జూన్ 2023లో విడుదలైంది. ఇప్పుడు దీనిని సినిమాగా రూపొందించబోతున్నారు. జమ్వాల్ ఇందులో దల్సిమ్ అనే పాత్రను పోషిస్తారు. నిప్పులు కురిపించే ఫైటింగ్ సామర్థ్యం కలిగిన యోగి తన కుటుంబాన్ని పోషించడానికి ఎలాంటి పోరాటం సాగించాడు? అనేదే కథాంశం. శాంతియుతంగా ఉండే అతడు పోరాటాలకు ఎందుకు దిగాల్సి వచ్చింది? అనేది సినిమాలోనే చూడాలి. చున్ లీగా లియాంగ్, రోడ్స్, దస్ట్ మాల్చియన్ తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. బ్యాడ్ ట్రిప్, ఆర్డ్‌వార్క్ చిత్రాలతో పేరు తెచ్చుకున్న కితావో సకురాయ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు. ఆగస్టులో ఆస్ట్రేలియాలో షూటింగ్ ప్రారంభమవుతుంది. లెజెండరీ క్యాప్‌కామ్ ఇతరులతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. హాలీవుడ్ లో అడుగుపెడుతున్న జమ్వాల్ కి అభిమానులు శుభకాంక్షలు చెబుతూ, అక్కడ మనమేంటో చూపించాలి! అని ఎంకరేజ్ చేస్తుండడం ఆసక్తికరం.