బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ తల్లయ్యింది. హీరో సిద్దార్థ్ మల్హోత్రా-కియార్ అద్వానీ కాస్త ముందుగానే పేరెంట్స్ గా ప్రమోట్ అయ్యారు. నిన్న మంగళవారం ముంబైలోని గిర్‌గావ్ ప్రాంతంలో ఉన్న హెచ్. ఎన్. రిలయన్స్ ఆసుపత్రిలో కియారా అద్వానీ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.
ప్రస్తుతం తల్లీబిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని కియారా ఫ్యామిలీ తెలపడంతో... ఈ శుభవార్త విన్న అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా కియారా - సిద్దార్థ్ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ ఫిబ్రవరిలోనే తాము తల్లితండ్రులు అవ్వబోతున్నామనే వార్త వినిపించిన సిద్దార్థ్-కియారాలు ఆతర్వాత ఎవరి సినిమా షూటింగ్స్ లో వారు బిజీ అయ్యారు.
కియారా అద్వానీ మెట్ గాలా ఫ్యాషన్ షో లో బేబీ బంప్ తోనే రాంప్ వాక్ చేసి అలరించింది. అలాగే యష్ హీరోగా తెరకెక్కుతున్న టాక్సిక్ షూటింగ్ లోను పాల్గొంటుంది. అయితే కియారా ప్రసవం ఆగస్టు లో జరగాల్సి ఉండగా.. నెల రోజుల ముందుగానే ఆమె ఆడ బిడ్డకు జన్మనివ్వడం గమనార్హం.