రాజులు పోయారు.. రాజ్యాలు పోయాయి. రాచరికంతో పాటు జమీందారీలు పట్వారీల పెత్తనం కూడా నాశనమైంది. ప్రస్తుతం కళియుగ ప్రజానీకం హవా, అల్ట్రా మోడ్రన్ యుగం నడుస్తోంది. నేటి డిజిటల్ యుగంలో ఎవరికీ కథల పుస్తకాలు చదివే అలవాటు లేదు. చందమామ, బాలమిత్ర లేదా బుజ్జాయి గురించి ఎవరైనా చెబితేనే తెలుస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో చందమామ కథల్లో రాజులు, రాకుమారులు, బందిపోట్లు ఎలా ఉంటారో చెబితే కొంచెమైనా అర్థమవుతుందా?
కనీసం ఊహ కూడా తెలీదు. 80లలో 90లలో యువతరాన్ని అడిగితే చందమామ పుస్తకంలో లేదా బొమ్మరిల్లు బుజ్జాయి కథల పుస్తకాల్లో రాజులు, రాకుమారులు, బందిపోట్లు అంటే కనీసం గిరజాల జుత్తు, మెలితిప్పిన కోరమీసం, నుదిటిపై వాలిపోయే శోభన్ బాబు రింగు ఇవన్నీ ఊహించుకుంటారు. రాజుల కాలం నాటి కాస్ట్యూమ్స్, భారీ ఆభరణాలు, మేకప్ విధానం ఎలా ఉంటాయో కూడా ఊహిస్తారు. ఇటు భారతీయ సంస్కృతి సాంప్రదాయం, రాజుల కాలంలో ఎలా ఉండేదో ఒక అవగాహన నాటి ప్రజలకు ఉంది. అలాగే రోమ్ నగరం, ట్రాయ్ యుద్ధ వీరుల రూపాల గురించి వారి కాస్ట్యూమ్స్ , తలకట్టు గురించి కూడా చెప్పగలిగే కెపాసిటీ 90ల నాటి యువతరానికి ఉంది. కానీ నేటి యూత్ దానిని హాలీవుడ్ సినిమాల్లో చూసి మాత్రమే చెప్పగలరు.
కారణం ఏదైనా ఈరోజు విడుదలైన హరి హర వీరమల్లు ట్రైలర్ లో చిత్ర కథానాయకుడు పవన్ కల్యాణ్ గెటప్ చూడగానే నాటి కాలంలో బందిపోటు రూపం ఇలా ఉంటుందా? అనే సందేహాలు మొదలయ్యాయి. హరిహర వీరమల్లులో అతడు కోహినూర్ ని సాధించే బందిపోటు లేదా యోధుడిగా కనిపిస్తాడని ప్రచారం ఉంది. కానీ ఆరోజుల్లో బందిపోటు నిజానికి ఎలా ఉండేవాడు? అంటే.... గిరజాల జుత్తు లేదా ఏపుగా పెరిగిన జుత్తు చింపిరి గడ్డం లేదా, ముతక మాసిన కాస్ట్యూమ్స్ ని మాత్రమే యూత్ ఊహించుకోగలరు. కానీ పవన్ గెటప్ చూడగానే ఇది కచ్ఛితంగా అల్ట్రా మోడ్రన్ యుగానికి మాత్రమే వర్తింపజేసిన గెటప్ గా భావించాల్సి వస్తోంది. కనీసం పవన్ బాహుబలిలా పొడవాటి జుత్తు పెంచలేదు. గిరజాల జుత్తు అసలే లేదు. పక్క పాపిడితో తమ్ముడు, ఖుషి సినిమాలో హీరోలాగే ఉన్నాడు! అంతో ఇంతో కాస్ట్యూమ్స్ పరంగా కొంత జాగ్రత్త తీసుకున్నట్టు అనిపిస్తుంది. కారణం ఏదైనా ఆరోజుల్లో జరిగిన చారిత్రాత్మక కథను ఇది ఎలివేట్ చేస్తుందా? అనే సందేహం కలగక మానదు. విచిత్రంగా ఇంతకుముందు గుణశేఖర్ `రుద్రమదేవి`లో గోనగన్నారెడ్డి పాత్ర కూడా ఇదే విధమైన వేషధారణతో ఆశ్చర్యం కలిగించింది. గన్నారెడ్డి పాత కాలం బందిపోటు అయినా, బన్ని తలకట్టు మోడ్రన్ టచ్ తో కనిపిస్తుంది. అప్పట్లో ప్రజలు, విమర్శకులు కూడా అంతగా లాజిక్ వెతకలేదు. బన్ని నటనను మెచ్చుకున్నారు. అయితే మన దర్శకనిర్మాతలు ఇప్పటి జనరేషన్ ని దృష్టిలో ఉంచుకునే ఈ పాత్రల ఆహార్యాన్ని రూపాన్ని డిజైన్ చేస్తున్నారని భావించాలేమో!
హాలీవుడ్ లో ట్రాయ్, గ్లాడియేటర్ లాంటి సినిమాలను పరిశీలించినా, నాటి రోజుల్లో చక్రవర్తులు, యోధానుయోధుల రూపాలు ఇలా ఉండేవి కదా! అని ఆలోచించుకునేలా కనిపిస్తాయి. సంచలనాల ట్రాయ్ చిత్రంలో యోధుడైన బ్రాడ్ ఫిట్ పొడవాటి గిరజాల జుత్తుతో కనిపిస్తాడు. అదృష్ట వశాత్తూ బాహుబలి చిత్రంలో అమరేంద్ర బాహుబలి లేదా భళ్లాల దేవుల పాత్రలను గిరజాల జుత్తు, కోర మీసాలతో చందమామ బుజ్జాయి కాస్ట్యూమ్స్ తో చూపించారు రాజమౌళి. అది ఆయన ఔచిత్యం. కానీ అందరు దర్శకులు, అందరు హీరోలు ఒకేలా ఆలోచించరు కదా!
ప్రతి పది సంవత్సరాలకు ఒక జనరేషన్ మారుతూనే ఉంటుంది. ఎప్పటికప్పుడు మారిన ట్రెండ్ ను అనుసరించి మేకర్స్ ఇలా తారుమారు తకరారు చేస్తున్నారని భావించాలేమో!!