ఎవరు ఈ నటుడు? బాగా పైప్ పీల్చడానికి అలవాటు పడ్డాడు. హుక్కా పీల్చడంలో ఎక్స్ పర్ట్ అనుకుంటా! ఫంకీల జుత్తు.. చేతినిండా టాటూలు.. మెడలో లాకెట్.. బంగారు రంగు వాచీ.. బ్లాక్ బనియన్.. ఏ కోణంలో చూసినా ఊర మాస్ లా కనిపిస్తున్నాడు. ఇన్ స్టంట్ గా `కూలీ`లో అమీర్ ఖాన్ లుక్ సక్సెస్... అతడి లుక్ పూర్తిగా మాస్ ని ఆకర్షిస్తోందనడంలో సందేహం లేదు.
సూపర్ స్టార్ రజనీకాంత్, నాగార్జున, ఉపేంద్ర లాంటి పెద్ద స్టార్లు నటిస్తున్న సినిమాలో బాలీవుడ్ దిగ్గజ నటుడు అమీర్ ఖాన్ కి ఎలాంటి అతిథి పాత్రను ఆఫర్ చేసారు? అన్నది ఆసక్తిగా మారింది. అయితే ఈ పాత్ర ఏమిటి? సినిమా కథేమిటి? అన్నది అడక్కుండానే అమీర్ ఖాన్ ఓకే చేసారట. సూపర్ స్టార్ రజనీకాంత్ కి తాను అభిమానిని అని చెప్పిన అమీర్, తనకు కాల్ రాగానే మరో మాటే లేకుండా ఈ పాత్రలో చేయడానికి అంగీకరించారట. కూలీలో దాహా అనే మాస్ పాత్రలో అతడు నటిస్తున్నాడు. ఆగస్టు 14న థియేటర్లలో ట్రీట్ కి సిద్ధం కండి! అంటూ ఈ లుక్ ని రజనీకాంత్ అండ్ టీమ్ రిలీజ్ చేయడంతో ఇది వైరల్ గా మారింది.
ఈ సినిమాలో అవకాశం ఇచ్చినందుకు రజనీకాంత్ పై తన ప్రేమను, గౌరవాన్ని కూడా చాటుకుంటున్నాడు అమీర్. లాల్ సింగ్ చడ్డా, సీతారే జమీన్ పార్ అంటూ మాస్ కి దూరంగా ఉన్న సినిమాల్లో నటించాడు. ఇవేవీ సంతృప్తికరమైన ఫలితాన్ని ఇవ్వలేదు. ఇప్పుడు సిసలైన మాస్ సినిమాలో, ఈ సరికొత్త మాస్ లుక్కుతో అతడు సౌత్ అంతటికీ కనెక్టవుతున్నాడనడంలో సందేహం లేదు. కూలీ చిత్రానికి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించారు. సన్ పిక్చర్స్ నిర్మించింది.