పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్- పాకిస్తాన్ మధ్య సన్నివేశం ఒక్కసారిగా మారిపోయిన సంగతి తెలిసిందే. దేశ ప్రధానిని సవాల్ చేస్తూ, ఉగ్రవాదులు 26 మందిని దారుణంగా తుపాకులతో కాల్చి చంపారు. భారతీయ మహిళల పసుపు కుంకుమలను చెరిపేసారు. దానికి కౌంటర్ గా భారత్ `ఆపరేషన్ సిందూర్`తో సమాధానం ఇచ్చింది.
అయితే ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తానీ కళాకారులు నటించిన సినిమాలను భారతదేశంలో నిషేధించారు. గాయకుడు, నటుడు దిల్జీత్ దోసాంజ్ నటించిన సర్ధార్జీ 3లో పాకిస్తానీ నటి హనియా అమీర్ కథానాయికగా నటించడం పెద్ద చిక్కుల్ని తెచ్చింది. ఈ సినిమాని భారత్ లో రిలీజ్ కానివ్వకుండా నిషేధించారు. అయితే `సర్దార్జీ 3` పాకిస్తాన్ లో విడుదలై గ్రాండ్ సక్సెసైంది.
ఈ సినిమాని భారత్ లో విడుదల కానివ్వనందుకు, దిల్జీత్ కి వ్యతిరేకంగా నినదిస్తున్న వారికి సమాధానంగా, అతడికి మద్ధతుగా సీనియర్ నటుడు నసీరుద్దీన్ షా తన ఎఫ్.బిలో ఒక కామెంట్ చేసారు. ``ఇది జుమ్లా పార్టీ డర్టీ ట్రిక్స్`` అని పరోక్షంగా భాజపాను విమర్శించాడు. పాకిస్తానీ నటి సినిమాలో నటించినందుకు స్టార్ బాధ్యత వహించడు. అది దర్శకుడి ఎంపిక. అయినా పహల్గామ్ దాడికి ముందు ఈ ఎంపిక జరిగిందని నసీరుద్దీన్ తన ఎఫ్.బిలో రాసాడు. ``పాకిస్తాన్ కి వెళ్లండి అనే వారికి నా ప్రతిస్పందన కైలాసానికి వెళ్లండి`` అని కూడా నసీరుద్దీన్ వ్యాఖ్యానించాడు. పాకిస్తాన్ లో తన స్నేహితులను కలవకుండా ఉండను అని అన్నాడు. ఈ వ్యాఖ్యలకు స్పందించిన భాజపా నాయకులు అతడిని తీవ్రంగా దుమ్మెత్తిపోస్తున్నారు. అతడు హిందూ వ్యతిరేకి అని, మన శత్రుదేశం పాకిస్తాన్ కి మద్ధతుదారు అని విమర్శిస్తున్నారు. పవిత్ర కైలాస భూమిపై వ్యాఖ్యానించి అతడు హిందువుల మనోభావాలను దెబ్బ తీసాడని తీవ్రంగా విమర్శిస్తున్నారు.
తనపై తీవ్ర వ్యతిరేకత రావడంతో నసీరుద్దీన్ షా ఎఫ్.బి నుంచి తన పోస్ట్ ను తొలగించారు. మనోభావాలు దెబ్బ తింటున్న ఈరోజుల్లో సీనియర్ నటుడు చేయకూడని తప్పు చేసాడు. ప్రస్తుతం నసీరుద్దీన్ పై భాజపా నాయకులు, ప్రభుత్వం కొంత సీరియస్ గానే ఉందని అర్థమవుతోంది.