రంగస్థలం, సినీరంగ నటుడు.. `సాహో` ఫేం ప్రకాష్ బెలవాడీ తాజాగా కన్నడ ఇండస్ట్రీపై సంచలన ఆరోపణలు చేసారు. అక్కడ ఒక పెద్ద బ్యానర్ తనకు పారితోషికం బకాయి చెల్లించకుండా, ఎలా టార్చర్ చేసిందో ఎలా అవమానించిందో కూడా వెల్లడించాడు. కన్నడిగులు కాని వారే ఇలా ప్రవర్తిస్తారని కూడా ఆరోపించాడు.
నాలుగు ఇన్ స్టాల్ మెంట్లలో తన పేమెంట్ చెల్లించాల్సి ఉండగా, నాలుగో పేమెంట్ కి ముందు చాలా టార్చర్ చేసారని, వారి వల్ల కారవ్యాన్ వెలుపల ఎండలో ఎదురు చూడాల్సి వచ్చిందని బెలవాడీ ఆరోపించారు. సదరు బ్యానర్ సభ్యులు తనను పారితోషికం తగ్గించుకోవాల్సిందిగా అడిగారు. కానీ దానికి అతడు నిరాకరించాడు. ఆ తర్వాత పరిణామాలు మారిపోయాయని తెలిపాడు. తనకు జరిగిన బాధాకర అవమానం ఎలా ఉన్నా, తాను బ్యానర్ పేరు వెల్లడించలేనని అన్నాడు. ఆ బ్యానర్ చాలా పెద్ద బ్యానర్ అని, అవకాశాలు రావనే భయంతో కాదు.. కానీ ఆ కష్టకాలం కలతపెట్టే స్థాయి కారణంగా చెప్పలేను అని వివరించాడు.
పెద్ద బ్యానర్ సినిమాలో నటించాను. నేను వారికి భయపడుతున్నాను కాబట్టి పేరు చెప్పను. వారు నాకు అవకాశం ఇవ్వరని కాదు. కానీ వాళ్లు పిలిచి నాకు రోజుకు రూ.10 లక్షలు ఇచ్చినా, నేను వారితో మళ్లీ పని చేయను కాబట్టి! అని చెప్పాడు. తాను పారితోషికం తగ్గించుకోనని చెప్పినందుకు తనపై జులుం ప్రదర్శించారని తెలిపాడు. తాను గౌరవప్రదంగా తిరస్కరించినా కానీ, చిత్ర బృందం తన పేమెంట్ లో కొంత భాగాన్ని ఆపేసి, షూటింగ్ చివరి రోజున పూర్తిగా విధ్వంసానికి పాల్పడిందని అతడు ఆరోపించాడు.
నా వ్యానిటీ వ్యాన్ వద్దకు నలుగురు వ్యక్తులను పంపారు. వారు లోపల తిన్నారు, మాంసం ముక్కలు అంతటా విసిరారు.. వాటర్ ట్యాంక్ ఖాళీ చేశారు.. లోపల మలవిసర్జన చేశారు.. భరించలేనంతగా మారింది. దుర్వాసన కారణంగా నేను బయట కూర్చోవలసి వచ్చింది! అని అతడు గుర్తు చేసుకున్నాడు. ఈ సంఘటన చాలా బాధాకరమైనది .. ఇది మొత్తం కన్నడ చిత్ర పరిశ్రమను ప్రతిబింబించదని బెలావాడి ఆరోపించారు. కర్ణాటకకు చెందని వారు ఇలాంటి ప్రవర్తనను ప్రదర్శిస్తారని ఆయన ఎత్తి చూపారు. ఈ విధంగా ప్రవర్తించే చాలా మంది నిర్మాతలు కన్నడిగులు కాదు. రాజ్‌కుమార్ కుటుంబంతో కలిసి పనిచేస్తే అది పూర్తిగా భిన్నమైన అనుభవం - వారు చాలా సంస్కారవంతులు! అని ఆయన అన్నారు. కన్నడ ఇండస్ట్రీ వ్యక్తుల దోపిడీ అనుభవాన్ని ఆయన వివరించే ప్రయత్నం చేసారు.
సహజసిద్ధమైన నటనతో పాపులరైన స్టేజీ డ్రామా ఆర్టిస్ట్ ప్రకాష్ బెలావాడి చాలా కాలంగా కన్నడ థియేటర్ రంగం, సినీరంగంలోను రాణించారు. దక్షిణాది పరిశ్రమల్లో, అలాగే హిందీ చిత్రాలలో నటించారు. ప్రభాస్ సాహో చిత్రంలో డీసెంట్ పోలీసాఫీసర్ గా నటించి మెప్పించారు. మద్రాస్ కేఫ్, ఇండియా లాక్‌డౌన్, ది కాశ్మీర్ ఫైల్స్, ఎయిర్‌లిఫ్ట్, ది తాష్కెంట్ ఫైల్స్‌లో అద్భుతమైన పాత్రలు పోషించారు. కన్నడ సినీరంగంలో థాండెల్, పెంటగాన్, వృత్ర, మేడ్ ఇన్ బెంగళూరు వంటి విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రాలలో నటించాడు.