కెరీర్ లో ఎదురేలేని బ్లాక్ బస్టర్లు సాధిస్తూ, టాప్ లీగ్ లో చేరాడు సందీప్ రెడ్డి వంగా. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ లాంటి సెన్సేషనల్ హిట్స్ సాధించి, భవిష్యత్ లో పాన్ వరల్డ్ దర్శకుడు అంటే ఇతడు మాత్రమే అని నిరూపించగలిగే సత్తా ఉన్నవాడిగా గ్యారెంటీ ఇచ్చాడు. అలాంటి సక్సెస్ ఉన్న దర్శకుడిని నిర్ధయగా, నిర్లక్ష్యంగా వ్యతిరేకించడమే గాక, హద్దు మీరి ఫెమినిజాన్ని ప్రదర్శించిన ప్రముఖ బాలీవుడ్ నటి దీపిక పదుకొనే ప్రస్తుత పరిస్థితిపై రకరకాల గుసగుసలు వినిపిస్తున్నాయి.
సందీప్ వంగా స్పిరిట్ లో నటించాలంటే, కండీషన్స్ అప్లయ్ అని చెప్పిన దీపిక 20 కోట్ల పారితోషికం, దాంతో పాటు లాభాల్లో వాటాలు కోరింది. అక్కడితో ఆగిపోలేదు.. ఆరు గంటలే పని చేస్తానని, చిత్రీకరణ సమయంలో లిప్ సింక్ కోసం తెలుగు పదాలు పలకలేనని మొరాయించినట్టు కథనాలొచ్చాయి. దీనికి తోడు తనను సినిమా నుంచి తొలగించగానే, ఇది `ఏ` రేటెడ్ సినిమా అంటూ పీఆర్ తో లీక్ చేయించిన దీపిక తెలివి తక్కువ పనికి ఇప్పుడు టాలీవుడ్ భగభగ మండుతోంది.
టాలీవుడ్ పాపులర్ నిర్మాణ సంస్థలు, దర్శకనిర్మాతలు దీపికకు ఎలాంటి అవకాశాలు ఇవ్వకూడదని నిర్ణయించినట్టు గుసగుస వినిపిస్తోంది. అంతేకాదు.. నాగ్ అశ్విన్- అశ్వనిదత్ కాంబినేషన్ రూపొందిస్తున్న `కల్కి 2898 ఏడి` సీక్వెల్ కి దీపికను కొనసాగిస్తారా లేదా? అన్న సందిగ్ధత ఇప్పుడు వ్యక్తమవుతోంది. కల్కి కోసం 20కోట్లు డిమాండ్ చేసిందని అప్పట్లోనే కథనాలొచ్చాయి. ప్రభాస్ తో సమానంగా తనకు రెస్పెక్ట్, సౌకర్యాలు కోరిందని కూడా గుసగుసలు వినిపించాయి. ఇవి రెండూ ఓకే కానీ, తెలుగు పదాలు పలకలేను.. పని గంటలు తనకు నచ్చినట్టే ఉండాలని పట్టుబట్టడాన్ని, సినిమా కంటెంట్ ని లీక్ చేయడాన్ని ఎవరైనా సహించగలరా? వీటిని క్రమశిక్షణా రాహిత్యంగా పరిగణిస్తే అశ్వనిదత్ బృందం కల్కి 2898ఏడి సీక్వెల్ లో దీపికను కొనసాగించాలా? వద్దా? మీరే నిర్ణయించండి.