గన్నవరం టీడీపీ ఉద్యోగి కిడ్నాప్ కేసులో అలాగే టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో అరెస్ట్ అయ్యి రిమాండ్ ఖైదీగా మారిన వైసీపీ నేత వల్లభనేని వంశీ కి ఆ రెండు కేసుల్లో బెయిల్ వచ్చినా.. ప్రస్తుతం నకిలీ ఇళ్ల పట్టాల కేసుకు సంబంధించి ఆయన పోలీసుల అదుపులో ఉన్నారు. జైలుకెళ్ళినప్పుడు పులిలా కనిపించిన వల్లభనేని ఇప్పుడు అనారోగ్యం బారిన పడ్డారు.
శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వల్లభనేని వంశీ ఆరోగ్యం క్షీణించడంతో కంకిపాడు పోలీసులు ఆయన్ని హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈరోజు వంశీ కి మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి (జీజీహెచ్) తరలించి, చికిత్స చేయించారు. తాజాగా గుంటూరు జీజీహెచ్ వైద్యులు వంశీ హెల్త్ బులిటెన్‌ను విడుదల చేశారు.
ఆ హెల్త్ బులిటెన్ లో వంశీకి ఫిట్స్ ఉన్నాయి. నిద్రపోతున్న సమయంలో ఆయనకు శ్వాస ఆగిపోతోంది అని, ఈ సమస్యకు సరైన చికిత్స అందించాలంటే స్లీప్ టెస్ట్ చేయాల్సి ఉంటుందని, కానీ గుంటూరు జీజీహెచ్‌లో స్లీప్ టెస్ట్ చేసేందుకు అవసరమైన పరికరాలు అందుబాటులో లేవని, అందుకే వంశీకి స్లీప్ టెస్ట్ చేయించుకోవడానికి వేరొక ఆసుపత్రికి సిఫార్సు చేసినట్లు వెల్లడించారు.