స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ విశ్లేషణ, స్ట్రాంగ్ వాయిస్ యువతరాన్ని చాలా ఆకర్షిస్తుంది. అతడు ఏదైనా సినిమాలో స్త్రీ పాత్రను గ్లామరస్ కోణంలో మాత్రమే కాదు.. బలమైన స్త్రీవాదాన్ని వినిపించే తల్లి పాత్రలను, సోదరి పాత్రలను, ఇతర సహాయక పాత్రలను కూడా చూపించారు. ఇటీవల పూరి మ్యూజింగ్స్ లో ప్రపంచవ్యాప్తంగా మనకు తెలియని ఎన్నో విషయాలను ఆయన చెబుతున్నారు.
ఇప్పుడు తేనెటీగలపై పరిశోధించి పూరి చెప్పిన కొన్ని సంగతులు ఎంతో ఆసక్తిని కలిగిస్తున్నాయి. అసలు తేనెను వృధా చేయొద్దు. ఒక తేనెటీగ జీవితాంతం శ్రమిస్తే అర టీస్పూన్ తేనె రెడీ అవుతుంది. దానిని అస్సలు వృధా చేయకండి అని పూరి సూచించారు. అవి ఇంట్లో తేనెపట్టు పెట్టినా దానిని డిస్ట్రబ్ చేయొద్దని అన్నారు. తేనెటీగలు లేకపోతే పాలినేషన్ అంతరించి కూరగాయలు పండవని, మనం తినడానికి ఏమీ మిగలదని కూడా వెల్లడించారు.
అలాగే తేనెటీగల కుటుంబాన్ని నడిపించేది స్త్రీ తేనెటీగ మాత్రమేనని, తేనె తయారీకి శ్రమించేది స్త్రీ తేనెటీగలు మాత్రమేనని పూరి తెలిపారు. రాణి తేనెటీగ గుడ్లు పెట్టి పిల్లల్ని పోషిస్తుంది. ఇది స్త్రీ ఆధిపత్య సమాజం అని పూరి వ్యాఖ్యానించారు. మగ తేనెటీగ కేవలం శృంగారం కోసం మాత్రమే గూడు చుట్టూ తిరుగుతుందని చెప్పారు. తేనెటీగలు సుదూర తీరాలకు వెళ్లి కొన్ని వేల పుష్పాలను పరిశీలించి వాటిలో తేనె ఉందో లేదో కనిపెట్టి తమ సమూహానికి సింబల్స్ ద్వారా తెలియజేస్తాయని చెప్పారు. ఈ వారం పూరి మ్యూజింగ్స్ లో తేనెటీగల గురించి చెప్పిన చాలా సంగతులు ఆసక్తిని రేకెత్తించాయి. ఈజిప్టులో వేల ఏళ్ల నాడు దాచిన తేనెను ఇప్పుడు కూడా తిన్నారు.. తేనెను సరైన విధానంలో నిల్వ చేస్తే ఎంతకాలమైనా పాడవ్వదని కూడా పూరి తన మ్యూజింగ్స్ లో తెలిపారు.