ప్రపంచాన్ని అత్యంత కర్కశంగా ట్రీట్ చేసిన కర్కోఠక ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ అమెరికా ట్రేడ్ సెంటర్ పై 9/11 దాడులతో గడగడలాడించిన సంగతి తెలిసిందే. ప్రయాణీకుల విమానాలను హైజాక్ చేసి వరల్డ్ ట్రేడ్ సెంటర్ భవంతులని కుప్పకూల్చిన విజువల్స్ ఇప్పటికీ ప్రజల కళ్ల ముందే కదులుతాయి. అగ్రరాజ్యం అమెరికాని షేక్ చేసిన ఈ ఉగ్రవాది తిరిగి పాకిస్తాన్ లో తలదాచుకోవడం ఒక సెన్సేషన్.
అయితే ట్రేడ్ సెంటర్ ని కుప్పకూల్చాక అవమాన భారంతో, ప్రతీకార జ్వాలలతో రగిలిపోయిన అమెరికా వైట్ హౌస్ అతడిని మట్టు పెట్టేందుకు చేయని ప్రయత్నం లేదు. ఆపరేషన్ ఒసామా బిన్ లాడెన్ ప్రారంభమైనా కానీ, అదేమీ అంత సులువుగా పూర్తి కాలేదు. లాడెన్ చిక్కినట్టే చిక్కి తప్పించుకుని పారిపోయాడు. ఆఫ్ఘనిస్తాన్ లో స్థావరం ఏర్పరుచుకుని పాకిస్తాన్ తో సంబంధాలు నడిపించాడు. పాక్ లోని కాకులు దూరని కారడవుల్లో గుహల్లో దాక్కున్నాడు.
కానీ అక్కడ కూడా అమెరికా సీఐఏ వదిలి పెట్టలేదు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీని నెట్ ఫ్లిక్స్ డాక్యు సిరీస్ గా రూపొందించి రిలీజ్ చేసింది. ``అమెరికన్ మ్యాన్ హంట్ : ఒసామా బిన్ లాడెన్`` పేరుతో నెట్ ఫ్లిక్స్ ఈ డాక్యు సిరీస్ ని స్ట్రీమ్ చేయగా దీనికి ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ సిరీస్ లో టోరా బోరా మిషన్ -2001 వైఫల్యం.. పాక్ లో ఆపరేషన్ నెప్ట్యూన్ స్పియర్ ప్రధాన హైలైట్స్. ఇది పేరుకు డాక్యు సిరీస్ అయినా ఒక సినిమాని మించిన ట్విస్టులతో రక్తి కట్టించింది. డానియల్ శివన్, మార్ లౌసీ ఈ సిరీస్ కి దర్శకత్వం వహించారు. లాడెన్ ని వేటాడిన అమెరికన్ల వైఫల్యాలను కూడా ఈ డాక్యు సిరీస్ యథాతథంగా ఎత్తి చూపడంతో అది ప్రజలకు బాగా నచ్చింది.