ఆస్కార్స్- గోల్డెన్ గ్లోబ్స్- హాలీవుడ్ క్రిటిక్స్ వంటి ప్రతిష్ఠాత్మక పురస్కారాల్లో గొప్ప గుర్తింపు, గౌరవం అందుకుని చివరికి అవార్డ్ విన్ అవ్వాలంటే దానికి సరైన ప్రచారం అవసరం. అలాంటి ప్రచారంతోనే ఆర్.ఆర్.ఆర్ లాంటి సినిమా అకాడెమీ అవార్డును గెలుచుకోగలిగింది.
టాలీవుడ్ దేశానికే ఆదర్శంగా నిలిచేలా చేయగలిగారు ఎస్.ఎస్.రాజమౌళి. అయితే అకాడెమీ పురస్కారాలు, గోల్డెన్ గ్లోబ్స్, హాలీవుడ్ ఫిలింక్రిటిక్స్ అవార్డులను భారతీయ సినిమాలు గెలుచుకోగలవు అని నిరూపించిన దార్శనికుడిగా అతడు గుర్తింపు తెచ్చుకుని, అటుపై ఆస్కార్ కమిటీల్లో కూడా ఒక సభ్యునిగా చోటు దక్కించుకోవడం విశేషం.
గత ఏడాది అకాడెమీ ప్రకటన ప్రకారం.. 487 మంది సభ్యులను అకాడెమీ కొత్తగా చేర్చుకుంది. కొత్త అకాడమీ సభ్యులలో ఎస్ఎస్ రాజమౌళి, రితేష్ సిధ్వానీ, రవి వర్మన్, షబానా అజ్మీ వంటి ప్రముఖులకు అవకాశం కలిగింది. అయితే అకాడెమీ పురస్కారాల కోసం నామినేషన్ కి వెళ్లాలంటే ముందే ఏదైనా సినిమాకి ప్రచారం చాలా అవసరం. విదేశీ కేటగిరీలో భారత్ నుంచి వెళ్లే సినిమాలకు ప్రచారం చాలా ముందుగా మొదలు కావాలి. ప్రస్తుతం కేన్స్ లో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక ఉత్సవాల్లో భారతీయ సినిమాలకు ప్రచారం చాలా అవసరం. కానీ ఇప్పటివరకూ మన దర్శకనిర్మాతలు ఎవరూ దీని గురించి ఆలోచించినట్టు లేదు. ముఖ్యంగా టాలీవుడ్ నుంచి ఈసారి ఆస్కార్ కి వెళ్లే సినిమా ఏదీ లేదంటారా? కనీసం భారతదేశం నుంచి అయినా అలాంటి సినిమా ఏదైనా ఉందో లేదో కనుగొనాల్సి ఉంది.