ఆస్కార్ అవార్డు విన్ అయిన తర్వాత RRR `నాటు నాటు` వెనుక ఉన్న కష్టం, చెమట అంతా మాయమయ్యాయని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. 95వ అకాడమీ అవార్డులలో `నాటు నాటు` ఉత్తమ ఒరిజినల్ సాంగ్‌గా ఆస్కార్ అవార్డును గెలుచుకునే ముందు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చార్ట్ బస్టర్ సాంగ్ గా నిలిచింది. ముఖ్యంగా ఈ పాట కోసం రామ్ చరణ్, ఎన్టీఆర్ చాలా హార్డ్ వర్క్ చేసారు. స్టెప్పులు కొరియోగ్రాఫ్ చేసిన ప్రేమ్ రక్షిత్ పనితనాన్ని కూడా మర్చిపోకూడదు. చంద్రబోస్ లిరిక్, ఎంఎం కీరవాణి మాస్ బీట్ అదనపు బూస్ట్ నిచ్చాయి.
ఇటీవల దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి - రామ్ చరణ్‌లతో కలిసి రాయల్ ఆల్బర్ట్ హాల్‌లో జరిగిన ప్రత్యక్ష కచేరీ కోసం ఆర్ఆర్ఆర్ టీమ్ లండన్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ కూడా టీమ్ తో పాటే ఉన్నాడు. వేడుకలో ఆస్కార్ అవార్డు అర్థం ఏమిటో.. ఆ పాట తనకు ఎప్పటికీ ఎలా విలువైనదో తారక్ వేదికపై మాట్లాడాడు. ఆస్కార్ గెలుచుకున్న తర్వాత ఆ పాట కోసం పడిన శ్రమ, దర్శకుడి(జక్కన్న) వల్ల అనుభవించిన హింస క్షణాల్లో మాయమయ్యాయని సరదాగా వ్యాఖ్యానించాడు.
ఎంతో కష్టపడటం గురించి కాదు.. ఆస్కార్ గెలుచుకున్నామని కాదు.. నా స్నేహితుడు, అద్భుత నృత్యకారుడితో కలిసి స్క్రీన్ ని షేర్ చేసుకున్నందుకు దీనిని ప్రత్యేక పాటగా గుర్తుంచుకుంటానని తారక్ అన్నాడు. ఎన్టీఆర్, చరణ్ ఈ పాటలో సింగిల్ లెగ్ స్టెప్ కోసం చాలా శ్రమించారు. బీట్ కి తగ్గట్టు వేగంగా డ్యాన్స్ చేసేందుకు చాలా ప్రాక్టీస్ చేసామని అప్పట్లో చెప్పారు. కానీ అన్ని కష్టాలను ఆస్కార్ గెలుచుకున్న తర్వాత మర్చిపోయారు. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో #ఎన్టీఆర్ నీల్ చిత్రీకరణలో ఉన్నాడు. హృతిక్ `వార్ 2`తో బాలీవుడ్‌లోకి కూడా అడుగుపెడుతున్నాడు.