టాలీవుడ్ ప్రథమార్థంలో సంక్రాంతికి వస్తున్నాం, డాకు మహారాజ్, కోర్ట్, హిట్ 3 వంటి భారీ హిట్ చిత్రాలను అందించింది. టాలీవుడ్ తరహాలోనే మాలీవుడ్ కూడా చక్కని విజయాల్ని అందుకుంది. ఈ ఏడాది మోహన్ లాల్ నటించిన రెండు చిత్రాలు అద్భుతమైన విజయాలను అందించాయి. వీటిలో పృథ్వీరాజ్ దర్శకత్వం వహించిన ఎల్ 2 ఎంపూరన్ చిత్రం బాక్సాఫీస్ వద్ద 300కోట్ల వసూళ్లతో సంచలనం సృష్టించగా, మోహన్ లాల్ నటించిన మరో చిత్రం కూడా 200కోట్ల క్లబ్ వైపు దూసుకెళుతోంది. మోహన్‌లాల్ చిత్రం తుడారుమ్ రూ. 178 కోట్లతో థియేటర్లలో ఇంకా జోరుగా నడుస్తోంది. బాక్సింగ్ డ్రామా `అలపుజ్జ జింఖానా` రూ. 68 కోట్ల వసూళ్లతో మూడవ స్థానంలో ఉంది. మరో రెండు చిత్రాలు 50 కోట్ల క్లబ్ లో అడుగుపెట్టాయి.
అయితే సౌత్ లో పెద్దన్నగా చెప్పుకునే కోలీవుడ్ మాత్రం ఈ ఏడాది తీవ్రంగా నిరాశపరిచింది. తళా అజిత్ నటించిన రెండు సినిమాలు విదాయుమార్చి, గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రాలు ఆశించిన రేంజుకు వెళ్లలేకపోయాయి. అదే సమయంలో సూర్య రెట్రో భారీ అంచనాల నడుమ విడుదలైనా ఫ్లాప్ గా మిగిలింది. పెద్ద సినిమాలన్నీ పరాజయం పాలవ్వడంతో కోలీవుడ్ పూర్తిగా నీరసపడింది. అయితే ఓ రెండు మూడు చిన్న చిత్రాలు మాత్రం చక్కని విజయాల్ని అందుకోవడం కొంతలో కొంత ఊరట. కోలీవుడ్ లో రజనీ జైలర్ తర్వాత 500 కోట్ల క్లబ్ సినిమా లేదు. అయితే 2025 ద్వితీయార్థంలో రజనీ కూలీ వస్తుంది గనుక, కోలీవుడ్ పుంజుకుంటుందని అంచనా వేస్తున్నారు.
ఇదే సమయంలో పరిమిత బడ్జెట్లతో అవార్డ్ సినిమాలు తీసే మాలీవుడ్ అనూహ్యంగా రేసులోకి దూసుకొచ్చింది. మారిన మార్కెట్ డైనమిక్స్ లో నెమ్మదిగా మాలీవుడ్ 500కోట్ల క్లబ్ లో అడుగుపెట్టేందుకు ఎక్కువ సమయం పట్టకపోవచ్చని అంచనా వేస్తున్నారు.