అన్ని సినీపరిశ్రమల్లో ఇన్ సైడర్స్, ఔట్ సైడర్స్ టాపిక్ వేడెక్కిస్తోంది. ప్రతిభ లేని ఇన్ సైడర్స్ పైనా, నేపో కిడ్స్ పైనా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతుంటే, ప్రతిభావంతులైన ఔట్ సైడర్స్ కి అవకాశాలివ్వకుండా రాజకీయాలు చేసే సినీపెద్దలపై విరుచుకుపడుతున్నారు. కంగన, ఆయుష్మాన్ ఖురానా, కార్తీక్ ఆర్యన్, దివంగత సుశాంత్ సింగ్ రాజ్ పుత్ లాంటి ప్రతిభావంతులు తమపై కుట్రలు జరిగాయని పబ్లిగ్గా వాపోయిన సందర్భాలున్నాయి. కంగన డైరెక్టుగా కరణ్ జోహార్ లాంటి ప్రముఖుడిని టార్గెట్ చేస్తుంది. అతడు నేపోకిడ్స్ ని ప్రోత్సహించినంతగా కొత్తవారికి అవకాశాలు కల్పించడు అని విమర్శించింది కంగన.
అయితే తనపై వచ్చే విమర్శలపై కరణ్ వీలున్న ప్రతి వేదికపైనా ఇటీవల మాట్లాడుతున్నాడు. తాను నేపోకిడ్స్ కి మాత్రమే అవకాశాలు కల్పిస్తాననే ఆరోపణల్ని అతడు మరోసారి తిప్పికొట్టాడు. తాజా పాడ్ కాస్ట్ లో కరణ్ మాట్లాడుతూ.. తాను సినీపరిశ్రమకు 20 మంది కొత్త దర్శకులను 50 మంది కొత్త నటీనటుల్ని పరిచయం చేసానని వెల్లడించాడు. కేవలం నటవారసులను మాత్రమే పరిచయం చేసానని అనడం కరెక్ట్ కాదు. కొత్తవారిని పరిచయం చేసినా, ప్రజల దృష్టి కేవలం స్టార్ కిడ్స్ పైనే ఉంటుంది గనుక దానిని హైలైట్ చేసి నన్ను తప్పు పడుతున్నారని కరణ్ అన్నారు. కొత్తవారిని పరిచయం చేసినా కానీ ఆ క్రెడిట్ తనకు దక్కడం లేదని కరణ్ అన్నారు.
ఇటీవల అతడు వరుసగా ఫ్లాప్ సినిమాలు తీస్తున్నారు కదా? అన్న ప్రశ్నకు కూడా అతడు పూర్తిగా భిన్నమైన సమాధానం ఇచ్చాడు. 2024లో తెరకెక్కించిన సినిమాలతో తాను డబ్బును కోల్పోలేదని అన్నాడు. ధర్మ ప్రొడక్షన్స్ భాగస్వామ్య ఒప్పందం తర్వాత తాను మరింత బాధ్యతగా వ్యవహరిస్తున్నానని, సృజనాత్మక విభాగంపై పూర్తిగా శ్రద్ధ పెట్టానని అన్నాడు.