రణబీర్ కపూర్ ప్రధాన పాత్రలో రామాయణం చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు నితీష్ తివారీ. రెండు భాగాలుగా రూపొందించే ఈ చిత్రం కోసం నిర్మాణ సంస్థ ఏకంగా రూ.1000 కోట్లు ఖర్చు చేయనుందని కథనాలొచ్చాయి. ఈ సినిమాని ఇంటర్నేషనల్ ఆడియెన్ ని దృష్టిలో ఉంచుకుని రూపొందిస్తున్నందున బడ్జెట్ల పరంగా రాజీ అన్నదే లేదని డిఎన్ఇజి మల్హోత్రా చెప్పారు. ఆసక్తికరంగా ఈ సినిమాకి వీఎఫ్ఎక్స్ అందిస్తున్న డిఎన్ఇజి సంస్థ రాజీ లేని నిర్మాణం కోసం యష్ తో కలిసి సహభాగస్వామిగా అత్యంత భారీ పెట్టుబడులు పెడుతోంది.
అంతేకాదు.. ఈ సంస్థ తదుపరి పెద్ద అడుగు ముంబైలో ఫిలింసిటీ నిర్మాణం. దాదాపు రూ.3000 కోట్ల పెట్టుబడితో ముంబై ఔటర్ లో ఏకంగా రెండు వందల ఎకరాల్లో ఫిలింస్టూడియోని నిర్మించేందుకు ఫడ్నవిస్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడం ఒక సంచలనం. రెండు వందల ఎకరాల్లో రామోజీ ఫిలింసిటీ తరహాలోనే ఒక పెద్ద ఫిలింస్టూడియోని నిర్మించేందుకు ఏడాది చివరిలో భూమి పూజ జరగనుంది. స్టూడియో పూర్తిగా రామాయణం కాన్సెప్టుతో ఆహ్లాదకరమైన పచ్చదనం డిజైనర్ ఆకృతులతో పర్యాటకులను కూడా ఆకర్షిస్తుందని పునీత్ మల్హోత్రా చెప్పారు. ఇటీవల వేవ్స్ 2025 ఈవెంట్లో అతడు ఈ విషయాలన్నీ చెప్పడం అందరి దృష్టిని ఆకర్షించింది. అదంతా సరే కానీ... సామాన్యులకు కోటి అనే పదం పలకాలంటేనే భయం. అలాంటిది 4000 కోట్ల మూలధనాన్ని పెట్టుబడి పెట్టేందుకు అతడు ఎలా సమీకరిస్తున్నాడు? అన్నదే అర్థం కావడం లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. డిఎన్ఇజి కంపెనీ గతంలో డూన్ 2, ఓపెన్ హైమర్ వంటి భారీ హిట్ చిత్రాలకు వీఎఫ్ఎక్స్ అందించింది. అయినా కానీ వేల కోట్లతో స్టూడియోని నిర్మించేంతగా ఎదిగేసిందా? దీని వెనక షాడో ఎవరు? అంటూ సందేహాలు వ్యక్తమవుతున్నాయి.