క్రిష్ 4 దర్శకత్వ బాధ్యతల్ని తనయుడు హృతిక్ రోషన్ కి అప్పగిస్తూ నిర్మాత రాకేష్ రోషన్ సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. దాదాపు 1000 కోట్ల బడ్జెట్ తో రూపొందనున్న ఈ భారీ చిత్రానికి హృతిక్ దర్శకత్వం వహిస్తాడు అనగానే అందరూ ఆశ్చర్యపోయారు. అతడికి అంతటి అనుభవం లేదు కదా? డెబ్యూ దర్శకుడిగా సాహసం చేస్తున్నాడని కామెంట్ చేసారు. కానీ హృతిక్ రోషన్ సోదరి సునయన రోషన్ అతడికి మద్ధతుగా నిలిచారు. తన సోదరుడి పనితనంపై నమ్మకం కనబరిచారు.
ఇంత పెద్ద ప్రాజెక్ట్ ని తన సోదరుడికి అప్పగించగానే తన ఆనందానికి అవధుల్లేవని సునయన తాజా ఇంటర్వ్యూలో అన్నారు. దగ్గు ఈ బాధ్యతల్ని సరిగా నిర్వహించగలడని కూడా నమ్మకం వ్యక్తం చేసారు సునయన రోషన్. నేను క్రిష్ 4ని ప్రకటిస్తున్నాను అని నాన్నగారు చెప్పగానే ఎగిరి గంతేశాను.. అద్భుతం అని అన్నాను. అన్నయ్య దర్శకత్వం వహిస్తున్నాడు అని చెబుతూ నాన్న ఎమోషనల్ అయ్యారు. ఏడ్వడం ప్రారంభించారు. అది చూసి నేను ఏడ్చాను. నాన్న గారి నుంచి నా సోదరుడు బాధ్యతలు తీసుకున్నాడనేది ఎమోషనల్ ఘట్టం. అతడు అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నప్పుడే నాన్నకు కొన్ని సన్నివేశాల్లో మార్పులు సూచించేవాడు.. అని సునైన తెలిపింది.
హృతిక్ కొత్త పాత్రలోకి అడుగుపెడుతున్నట్టు ఇతరులకు అనిపించినా కానీ, దర్శకత్వంపై చాలా కాలంగా అతడి దృష్టి ఉందని సునైన గుర్తించినట్టు తెలిపారు. నా సోదరుడు ఇప్పుడు దర్శకుడిగా మారుతున్నాడని ఆలోచనే నాకు ఇంకా బాధగా ఉంది. నాన్న ఏడవడం నేను ఎప్పుడూ చూడలేదు.. కాబట్టి అది కూడా బాధగా ఉంది. హృతిక్ దర్శకుడిగా మారుతున్నాడని నాకు తెలియదు.. అది పూర్తిగా ఆశ్చర్యం కలిగించింది. నాన్న కళ్ళలో నీళ్లు తిరిగాయి.. అప్పుడే నేను ఆనందంతో కేకలు వేయడం మొదలుపెట్టాను. దుగ్గు(హృతిక్ ముద్దు పేరు) దర్శకుడిగా మారుతున్నందుకు గర్వంగా ఉంది. చాలా గర్వంగా ఉన్నప్పటికీ బాధగా ఉన్న క్షణం. ఇప్పుడు దగ్గు వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తాడు.. అని సునైనా రోషన్ ఎమోషనల్ గా చెప్పింది. క్రిష్ తొలి మూడు భాగాల్లో నటించిన కథానాయికలు తిరిగి క్రిష్ 4లో నటిస్తుండడం ఆసక్తికరం. హృతిక్ రోషన్ ఇందులో మూడు పాత్రలు పోషిస్తారని కూడా కథనాలొచ్చాయి. నటుడిగా కొనసాగుతూనే దర్శకత్వంలో సవాళ్లను అతడు అధిగమించాల్సి ఉంటుంది. 2026 ప్రారంభంలో ఈ క్రేజీ ప్రాజెక్ట్ ప్రారంభం కానుంది.