గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న `వార్ 2` ఆగస్టులో మోస్ట్ అవైటెడ్ చిత్రంగా విడుదలకు సిద్ధమవుతోంది. పఠాన్ లాంటి భారీ పాన్ ఇండియా చిత్రంతో 1000 కోట్ల క్లబ్ అందుకున్న యష్ రాజ్ ఫిలింస్, రెట్టించిన ఉత్సాహంతో వార్ 2 ని నిర్మిస్తోంది. ఈ సినిమాతో యంగ్ టైగర్ బాలీవుడ్ లో అడుగుపెడుతుండడంతో అతడి అభిమానుల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. వార్ 2 ని యష్ రాజ్ బ్యానర్ మరో లెవల్లో తెరకెక్కిస్తోంది. ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ మరో లెవల్లో అలరిస్తాయని, వీఎఫ్ఎక్స్ పనితనం మైండ్ బ్లాక్ చేస్తుందని కథనాలొస్తున్నాయి.
ఇదిలా ఉంటే `వార్ 2` తెలుగు రైట్స్ ఏ పంపిణీదారుడికి దక్కాయి? అన్న చర్చ సాగుతోంది. ఇటీవల తెలుగు మీడియాపై ఘాటైన కామెంట్లతో విరుచుకుపడ్డ యువనిర్మాత `వార్ 2` పంపిణీ హక్కుల్ని ఛేజిక్కించుకున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటివరకూ `వార్ 2` తెలుగు రైట్స్ అమ్మకాలు పూర్తి కాలేదు. ఈ విషయాన్ని అతడే స్వయంగా అంగీకరించాడు. ఒకవేళ హక్కులు కొనుగోలు చేస్తే స్వయంగా ప్రకటిస్తానని కూడా చెప్పారు.
ఎన్టీఆర్ తో సాన్నిహిత్యం కారణంగా ఈ నిర్మాతకు హక్కులు దక్కే ఛాన్సుందని ఊహాగానాలు సాగుతున్నాయి. కానీ రేసులో `వార్ 2` హక్కులు కొనుగోలు చేసేందుకు పంపిణీ రంగంలోని దిగ్గజాలు పోటీ బరిలో దిగనున్నాయని కూడా గుసగుస వినిపిస్తోంది. హృతిక్, ఎన్టీఆర్ లకు ఉన్న పాన్ ఇండియా స్టార్ డమ్ దృష్ట్యా రైట్స్ కోసం భారీ మొత్తాల్ని కోట్ చేసే ఛాన్సుందని ఒక అంచనా.