సినిమా అనేది ఒక వ్యసనం. దీనిని జూదంతో పోలుస్తారు. జూదంలో ఓడి రోడ్డున పడినవాళ్లు ఎందరో. ఉన్నవన్నీ అమ్ముకుని బిచాణా ఎత్తేసిన ఎందరో నిర్మాతలను పరిశ్రమలు చూస్తున్నాయి. అయితే ఇప్పుడు ఒక ప్రముఖ పాన్ ఇండియన్ హీరో కం నిర్మాత పాపులర్ హిందీ దర్శకుడిని నమ్మి ఏకంగా 500 కోట్లు జూదం ఆడుతున్నాడని ఇండస్ట్రీలో గుసగుస వినిపిస్తోంది.
అతడు ఇటీవల పాన్ ఇండియా సినిమాల్లో నటించి, ఎదురే లేని సక్సెస్ తో సంపాదించుకున్న 200 కోట్ల డబ్బును తదుపరి పాన్ వరల్డ్ మూవీలో పెట్టుబడిగా పెడుతున్నాడు. అంతేకాదు.. అతడిని నమ్మి మరో 300-400 కోట్ల మధ్య పెట్టుబడి పెట్టేందుకు పలువురు ఫైనాన్షియర్లు కూడా వెంట వచ్చారు. దాదాపు 500 కోట్లు స్వయంగా ఖర్చు(ఫైనాన్షియర్లను కాపాడే బాధ్యత అతడిదేనట) చేస్తూ, ఈ పాన్ వరల్డ్ మూవీలో ఆ హీరో నటిస్తున్నాడు. అతడి భాగస్వామి కూడా మరో 500 కోట్లు పెట్టుబడి పెడుతున్నాడు. అయితే ఇప్పుడు ఆడుతున్న జూదంలో ఫైనాన్స్ తెస్తున్న ఈ స్టార్ హీరోకి తిరిగి ఆ డబ్బు వెనక్కి రాకపోతే?
ప్రస్తుతానికి ఈ పాన్ ఇండియా మూవీపై బజ్ బాగానే ఉంది. ప్రీరిలీజ్ బిజినెస్ తో సేఫ్ అవుతాడు. కానీ సినిమా రిలీజై ఎగ్జిబిటర్లు, బయ్యర్లు సేఫ్ అయినప్పుడే ఆ సినిమా హిట్టయినట్టు. తాను చేసిన అప్పులన్నీ క్లియర్ చేసాకే రిటర్నులు వచ్చినట్టు. కానీ ఈ హీరో మొండిగా 1000 కోట్ల జూదం ఆడటం చూస్తుంటే అతడి ధైర్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేం. ఎట్టకేలకు అతడు ఈ భారీ పాన్ వరల్డ్ సినిమాలో తన పాత్ర కోసం ప్రిపేర్ అవుతున్నాడు. త్వరలోనే అతడిపై దర్శకుడు కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తారు. అంతకంటే ముందే అతడు దేవాధిదేవుడు, పరమశివుని ఆలయంలో పూజలాచరించనున్నాడు. ప్రస్తుతానికి తన 500కోట్లు వెనక్కి రావాలంటే ఆ మహదేవునిదే భరోసా.