`అపోలో` సంస్థానం అంటే వేల కోట్ల సామ్రాజ్యం. అపోలో గ్రూప్స్ నేడు ప్రపంచంలోనే విస్త్రత నెట్ వర్క్‌ని కలిగి ఉంది. అంత పెద్ద సామ్రాజ్యంలో డబ్బు దర్పం అధికారం చుట్టూ చాలా సమస్యలు ఉంటాయి. గొడవలు ఉత్పన్నమవ్వడం సహజం. రిలయన్స్ ధీరూభాయి అంబానీ అంతటి వారే కొడుకులకు ఆస్తులు పంచడానికి చాలా ఎదుర్కోవాల్సి వచ్చింది. ముఖేష్ అంబానీ వర్సెస్ అనీల్ అంబానీ ఎపిసోడ్స్ గురించి తెలిసినదే. చాలామంది ధనవంతుల కుటుంబాల్లో ఆస్తుల తగాదాలు పబ్లిగ్గా చూసాం. కానీ అలాంటి వివాదాలు తమ ఇంట్లో రాకుండా ఉండేందుకు తాత ప్రతాప్ రెడ్డి ఒక కుటుంబ రాజ్యాంగం రాసారని ఉపాసన కొణిదెల తెలిపారు. అసలు సంపదలు గొడవలకు కారణం కాకూడదని వ్యాఖ్యానించారు.
కుటుంబంలో ఎవరూ డబ్బు కోసం వాదించుకోవడం ఇష్టం లేదని, దీని కోసం తాతయ్య కుటుంబ రాజ్యాంగాన్ని రూపొందించారని ఉపాసన చెప్పారు. మా కుటుంబంలో 38 మందితో సీక్రెట్ శాంటాను ప్రారంభించాం. ఇప్పుడు మాకు 44 మంది ఉన్నారు. ఏళ్లుగా కుటుంబం పెరిగింది.. వారిని తెలుసుకోవడం.. వారితో సమయం గడపడం ముఖ్యం. అప్పుడప్పుడు మీటింగుల్లో మాత్రమే కాకుండా ఒకరికోసం ఒకరు ఉండటం చాలా ముఖ్యం. మేము ఒక కుటుంబ వ్యాపారంలో ఉన్నాం. బిజినెస్ ఫ్యామిలీ కాబట్టి మాకు కుటుంబ రాజ్యాంగం కూడా రాసారు. సంపద కోసం ఎటువంటి తగాదాలు ఉండకూడదు.. డబ్బు మా కుటుంబంలో ఎప్పుడూ గొడవలకు కారణం కాకూడదు. ఇవి మా తాత పెట్టిన చట్టాలు. మేము చిన్న చిన్న విషయాలకు కొట్లాడుతాం కానీ పెద్ద విషయాలన్నీ ఆయనే రాసి పెట్టుకుని, పరిష్కారాలు ఉండేలా చూసుకుంటారు`` అని తెలిపారు.
ఉపాసన - రామ్ చరణ్ 2012లో వివాహం చేసుకున్నారు. ఈ జంట తమ మొదటి బిడ్డ క్లిన్ కారాను 2023లో స్వాగతించారు. ఉపాసన అదే ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను తన తాత మామలతో పెరిగానని, అందుకే క్లిన్ కారా తన జీవితంలో తాతా మామలను మిస్ కాకుండా చూసుకుంటున్నానని తెలిపారు.