2020 జూన్ 14న బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ముంబైలోని తన నివాసంలో అనుమానాస్పద స్థితిలో మరణించడంతో సినిమా ప్రపంచం ఉలిక్కిపడింది. ఆయన మృతి చుట్టూ అనేక అనుమానాలు వ్యాపించాయి. ముంబై పోలీసులు మొదట ఈ కేసును ఆత్మహత్యగా భావించి దర్యాప్తు చేపట్టారు. అయితే అతని కుటుంబ సభ్యులు, అభిమానులు హత్య కోణాన్ని ప్రస్తావించడంతో విచారణ మరింత లోతుగా కొనసాగింది. ముఖ్యంగా సుశాంత్ ప్రియురాలు, బాలీవుడ్ నటి రియా చక్రవర్తి పేరు తెర మీదకు రావడంతో కేసు మరింత జటిలమైంది.
సుశాంత్ తండ్రి కేకే సింగ్ సంచలన ఆరోపణలు చేశారు. తన కుమారుడి బ్యాంక్ ఖాతాల నుంచి రూ.15 కోట్లకు పైగా డబ్బును రియా చక్రవర్తి కుటుంబ సభ్యులు బదిలీ చేసుకున్నారని పేర్కొన్నారు. అంతేకాకుండా సుశాంత్‌కు మాదక ద్రవ్యాలు ఇచ్చినట్లు ఆరోపణలు రావడంతో ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED), మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగం (NCB) జోక్యం చేసుకున్నాయి. అనేక మలుపుల తర్వాత ఈ కేసు సీబీఐకు అప్పగించబడింది. రియా, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి కొన్నాళ్లు జైలులో కూడా ఉన్నారు. అనంతరం సీబీఐ వీరి కుటుంబంపై లుక్ ఔట్ నోటీసులు జారీ చేసింది.
ఇక దాదాపు నాలుగేళ్ల తర్వాత సీబీఐ ఈ కేసులో తన దర్యాప్తును ముగించింది. మార్చి 22న ముంబై కోర్టులో సీబీఐ క్లోజర్ రిపోర్ట్‌ను సమర్పించింది. అందులో సుశాంత్ మరణానికి సంబంధించి కుట్ర కోణాన్ని నిర్ధారించే ఎలాంటి ఆధారాలు లభించలేదని స్పష్టం చేసింది. అలాగే రియా చక్రవర్తిపై వచ్చిన ఆరోపణల్లో నిజం లేదని పేర్కొంటూ ఆమెకు క్లీన్ చీట్ ఇచ్చింది. అయితే సీబీఐ నివేదికపై సుశాంత్ కుటుంబ సభ్యులు ఏ విధంగా స్పందిస్తారో అన్నది ఆసక్తిగా మారింది.