మే 9న విడుదల కానున్న హరిహర వీరమల్లు కంటే ఓజి పట్ల పవన్ కళ్యాణ్ అభిమానుల్లో ఎక్కువ ఆసక్తి నెలకొన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ రెండు సినిమాల హైప్ విషయంలో గణనీయమైన వ్యత్యాసం ఉందని చెప్పొచ్చు. దర్శకుడు సుజిత్ రూపొందించిన టీజర్ మాత్రమే అభిమానులను ఉత్కంఠకు గురి చేయగా సినిమా షూటింగ్ ఇంకా కొంతమేరకు మిగిలే ఉంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అనారోగ్యం, రాజకీయ బాధ్యతలతో బిజీగా ఉండటంతో చిత్రబృందం ఆయన షూటింగ్ డేట్స్ కోసం ఎదురుచూస్తోంది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం ఏప్రిల్‌లో హరిహర వీరమల్లు, మే లేదా జూన్‌లో ఓజి కోసం పవన్ తన కాల్షీట్లు కేటాయించనున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా సెప్టెంబర్‌లో ఓజి విడుదల అయ్యే అవకాశముందని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ వార్త మెగా అభిమానుల్లో ఉత్సాహం పెంచినప్పటికీ దీని నిజానిజాలు తెలియాల్సి ఉంది. ఎందుకంటే హరిహర వీరమల్లు మేలో విడుదల అయితే కేవలం నాలుగు నెలల వ్యవధిలో మరో పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా సినిమా రావడం సాధ్యమేనా..? అన్న అనుమానం అభిమానుల్లో ఉంది. పైగా సినిమా పూర్తయ్యాక పోస్ట్ ప్రొడక్షన్, డబ్బింగ్, ప్రమోషన్ వంటి అనేక కార్యక్రమాలు ఉంటాయి. ఇదే సమయంలో అఖండ 2 తాండవం, సంబరాల ఏటి గట్టు, కాంతారా చాప్టర్ 1 వంటి సినిమాలు సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో విడుదలకు సిద్ధమవుతున్నాయి.
మరోవైపు రజనీకాంత్ కూలి కూడా ఆగస్ట్ 14 విడుదలను మిస్ చేసుకుని సెప్టెంబర్ నెలలోనే విడుదల కావచ్చనే వార్తలున్నాయి. ఇలా అనేక పెద్ద చిత్రాలు పోటీగా నిలుస్తున్న నేపథ్యంలో ఓజి సెప్టెంబర్‌లో ఫ్రీ గ్రౌండ్ దొరకడం కష్టమవుతుందని భావిస్తున్నారు. కానీ నిజంగానే సెప్టెంబర్ రిలీజ్ ప్లాన్ ఉంటే చిత్రబృందం ముందుగా అధికారిక ప్రకటన చేస్తేనే మరికొన్ని సినిమాలు తమ ప్లానింగ్‌ను మార్చుకోగలవు. అలా కాకుండా చివరి నిమిషంలో విడుదల తేదీ ప్రకటిస్తే అందరికీ చిక్కులు తలెత్తే అవకాశం ఉంది.
ఇక ఓజి విషయానికొస్తే ఇది పూర్తి స్థాయి గ్యాంగ్‌స్టర్ డ్రామా కానుండగా ప్రియాంక అరుళ్ మోహన్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ ఇందులో ప్రధాన ప్రతినాయక పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి థమన్ సంగీతాన్ని అందిస్తుండగా పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ సినిమాపై గట్టిగా నమ్మకంగా ఉన్నారు. అయితే సినిమా విడుదల తేదీపై స్పష్టత రావాల్సి ఉంది.