Advertisementt


మోహన్ బాబు వివాదం - అభిమాని ఆవేదన

Sun 22nd Dec 2024 06:35 PM
mohan babu  మోహన్ బాబు వివాదం - అభిమాని ఆవేదన
Mohan Babu Controversy - Fan Pain మోహన్ బాబు వివాదం - అభిమాని ఆవేదన
Advertisement
Ads by CJ

కుటుంబాలు వ్యక్తిగతం. అందులోని గొడవలు సర్వసాధారణం. ఇందుకు సెలబ్రిటీలు కాదు కదా మహామహులు కూడా మినహాయింపు కాదు. గొడవలు లేని కుటుంబాలు దాదాపుగా ఉండవు. లేవు. కేవలం ఈ గొడవల్లో ఎక్కువ, తక్కువలు మాత్రమే ఉంటాయి.

మంచు మోహన్ బాబు కుటుంబంలో కూడా ఈ గొడవలున్నాయి. కానీ ఎక్కువగా ఉన్నాయి. గొడవలు పెట్టుకునే వారు దానిని రచ్చ చేసేందుకు, తమ మాట వినని వారు పరువు బజారుకీడ్చేందుకు ఆ కుటుంబంలోని వ్యక్తులే అన్ని ప్రయత్నాలు చేస్తారు. అందులో భాగంగానే మంచు మనోజ్ కూడా తను అనుకున్నది జరగడం కోసం మీడియాను ఇన్ వాల్వ్ చేశాడు. మీడియాను అడ్డం పెట్టుకుని తన పంతం నెగ్గించుకోవాలనుకున్నాడు. 

అయితే సెలబ్రిటీల జీవితాల గురించి వార్తలు ఇవ్వడం, గాసిప్స్ ప్రసారం చేయడం మీడియాలో సర్వసాధారణం. కాకపోతే మీడియా సంస్థలు అనేకసార్లు స్వయం నియంత్రణ ద్వారా కుటుంబాల గొడవల్లో ఎంతవరకు వెళ్లొచ్చు? ఎక్కడ ఆగాలి? అని నిర్ణయించుకుని హుందాగా వ్యవహరించాయి. ఆ గౌరవాన్ని పొందాయి.

మంచు మోహన్ బాబు కుటుంబంలో గొడవల విషయంలోనూ అనేక మీడియా సంస్థలు స్వయం నియంత్రణ పాటించాయి. మంచు మనోజ్ మీడియాను ఆహ్వానించి, మీడియా ముందే ఇంటి గేటు బద్దలు కొట్టి, తన బౌన్సర్లను వెంటేసుకుని లోపలికి చొచ్చుకెళ్లాడు. నానా రచ్చ చేశాడు. అప్పటికే మోహన్ బాబు కు ఈ విషయం తెలిసి, వారికి నమస్కారం చేస్తూనే బయటకు వచ్చారు. ఈ విషయం ఆ వీడియో చూసిన వారెవరికైనా తెలుస్తుంది. 

అయితే ఆయన మీడియా వద్దకు వచ్చి, వారందరూ ఒక దగ్గర మీడియా సమావేశం మాదిరిగా ఉంటే.... దానిని ఉద్దేశించి మాట్లాడాలనుకున్నారు. కానీ అందరితో మాట్లాడితే మాకేముంటుంది గొప్ప, అందులో ఏముంటుంది కిక్కు అనుకున్న సదరు న్యూస్ ఛానల్ ప్రతినిధి... ఆయన పూర్తిగా బయటకు రాకముందే మైక్ తీసుకెళ్లి ఆయన మొహంలో పెట్టాడు. ఆ తోపులాటలో మైక్ పెట్టే క్రమంలో మోహన్ బాబుకు దెబ్బతగలడంతో ఆయన సహనం కోల్పోయాడు. అసలే మనోజ్ చికాకు పెడుతున్నాడు. పైగా మీడియాను, బౌన్సర్లను వేసుకుని గేటు బద్దలు కొట్టుకుని వచ్చాడు. అయినా తాను సంయమనం పాటించి, సంస్కారంగా నమస్కరిస్తూ వస్తుంటే ఆ సంస్థ ప్రతినిధి ప్రదర్శించిన అత్యుత్సాహం వల్ల మోహన్ బాబు మరింత అసహనానికి గురి కావల్సి వచ్చింది. వయసు రీత్యా, పరిస్థితుల రీత్యా తాను ఏం చేస్తున్నానో కూడా తనకే తెలువని స్థితిలో ఆయన మొఖంమీదకు వచ్చి, దెబ్బ తాకించిన మైక్ ను ఆపే ప్రయత్నంలో మైకును పక్కకు పెట్టే ప్రయత్నంలో ఆ ఛానల్ ప్రతినిధికి దెబ్బ తగిలింది. ఇదంతా కూడా అనుకోకుండా జరిగిన ప్రమాదం. దురదృష్టకర సంఘటన. దీనిని ఆ కుటుంబంలోని ప్రతి ఒక్కరూ ఖండించారు. క్షమించమని అడిగారు. 

అయితే కుటుంబ గొడవల్లో అత్యుత్సాహం ప్రదర్శించడమే ఆహ్వానించదగింది కాదు. ఒక గీత దాటి ఆ సంస్థ ప్రతినిధి ప్రవర్తించడం వల్లే ఈ సంఘటన జరిగింది. అతను అయ్యప్ప మాలలో ఉన్నప్పటికీ...కేవలం సంస్థ కోసమే అతను అలా చేశాడు. అతను అలా చేసేవిధంగా సంస్థే శిక్షణ ఇచ్చింది. అయ్యప్ప మాల అంటేనే సహనం. కానీ ఆ ప్రతినిధి కేవలం ఎక్స్ క్లూజివ్ కోసం చేసిన ప్రయత్నమే గొడవకు కారణమైంది. ఇది సత్యం.

కట్నం తీసుకున్న వాడు గాడిద అని హితవు పలికే సదరు ఛానల్.... కుటుంబ విషయాల్లో ఒకవైపు వారు పిలిచినా సరే జోక్యం చేసుకోవడం సరైంది కాదు... హద్దులు దాటి వ్యవహరించరాదు అని ఎందుకు తెలుసుకోవడం లేదు. స్వీయ నియంత్రణ పాటించడం లేదు. కుటుంబాలను గౌరవించడం లేదన్నది ప్రశ్న.

కేవలం టీఆర్పీ రేటింగ్ ల కోసం మేం ఎంతవరకైనా దిగజారుతాం...మమ్మల్ని కాదంటే, వారిస్తే, అడ్డుకుంటే వారిని చీల్చి చెండాడుతాం, అసహ్యంగా పేర్లు పెట్టి రాక్షసానందం పొందుతాం. అవసరమైతే మిగతా మీడియా వారిని రెచ్చగొట్టి ఆందోళనలు చేయిస్తాం. పోలీసులను ప్రభావితం చేసి, వారిమీద ఒత్తిడి తీసుకొచ్చి కేసులు పెట్టిస్తాం. కోర్టులకీడుస్తాం. బెయిల్ రద్దు కాకముందే రద్దయినట్లు, పారిపోయినట్లు తప్పుడు ప్రచారాలు చేసి దెప్పిపొడుస్తాం. వారి పరువు గంగలో కలిపే వరకు నిద్రపోం అనే తరహాలో రెచ్చిపోతాం అన్నట్లు వ్యవహరిస్తోంది.

ఎదుటి వారి వయసు, అతని కృషి, స్థాయి, గౌరవం ఇవన్నీ గాలికొదిలేసి అనుకోకుండా జరిగిన ఒక సంఘటన ఆధారంగా అతన్ని జడ్జ్ చేస్తాం,  కించపరుచుతాం, వ్యక్తిత్వ హననానికి పాల్పడుతాం అంటోంది. ఇది సరైనదేనా. ఒక్క సంఘటనతో ఒక వ్యక్తిని జడ్జీ చేయవచ్చా? అతన్ని కించపరుచవచ్చా? ఆలోచిద్దాం.

అనుకోకుండా తప్పు జరిగింది. దానికి చింతిస్తున్నాం. క్షమాపణలు కోరుతున్నాం. బాధితులను ఆదుకుంటాం. వారికి అండగా నిలబడుతాం మొర్రో అంటున్న వినకుండా నిన్ను వెంటాడుతాం, వేటాడుతాం, నీ సంగతి చూస్తామన్నట్లు బెదిరిస్తోంది. ఇది ఆహ్వానించదగిందేనా? ఆలోచిద్దాం..

సంస్కారం, సభ్యతల గురించి మాట్లాడే సదరు మీడియా ఛానల్ కనీసం పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చితం లేదన్న ఆర్యోక్తిని కూడా మరిచి, క్షమించమని వేడుకున్న వారిని కూడా కనికరించకుండా శునకానందం పొందడం నిజంగా బాధాకరం. దీనిని సమర్ధిద్దామా..? ఆలోచిద్దాం.

కాబట్టి మీడియా సంస్థలు ఈ విషయాన్ని గమనించాలి. నిజంగా సదరు మీడియా ప్రతినిధి ఈ అత్యుత్సాహం ఎందుకు ప్రదర్శించారు? ఆయన ప్రదర్శించడం వల్ల ఇది జరిగిందా..? మోహన్ బాబు ఫలానా మీడియా వారు ఎక్కడున్నారని వెదికి మరీ...వారి మీద దాడి చేశారా? ఈ ఒక్క విషయాన్ని ఆలోచిస్తే... ఇది అనుకోకుండా జరిగిందా? కావాలని చేసిందా? అనేది అందరికీ అర్థం అవుతుంది. ఇందులో మోహన్ బాబు కావాలని చేశాడన్న ఆ ఛానల్ వాదాన్ని బలపర్చుదామా? ఖండిద్దామా? ఆలోచిద్దాం...

అనుకోకుండా జరిగిన సంఘటన, క్షమాపణలు, కేసులు అయ్యాక కూడా దానిని భూతద్దంలో పెట్టి, రంధ్రానేష్వణ చేసి, ఆ వ్యక్తి పరువు తీసి, ఆ కుటుంబం గౌరవం దెబ్బతీసి ఆడుకునే నైతికత ఈ మీడియా ఛానల్ కు ఉందా?  మిగిలిన మీడియా సంస్థలుగా ఆలోచిద్దాం....

ఒక సంస్థ చేసే కుట్రలో అందరూ భాగం కావద్దు. ఆ సంస్థపై ఇప్పటికే ఎంతోమంది తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కోర్టులు కూడా మందలించాయి. మానవత్వం మరిచి రేటింగ్ ల కోసం వారు చేసే కార్యక్రమాలను తప్పు పట్టాయి. ఈ విషయంలో వారి వ్యక్తిగత పరువును మీడియా పరువుగా పరిగణిద్దామా? వారిది తప్పని వారిద్దామా? ఆలోచిద్దాం....

కాబట్టి ఈ వ్యవహారంలో మిగిలిన మీడియా సంస్థలు నిజానిజాలు గురించి, నైతికత గురించి ఆలోచించి మోహనం బాబుకు మద్దతు పలకాల్సిన అవసరం ఉంది. తప్పయిందన్న వ్యక్తిని వెంటాడే ఈ ఛానల్ తీరును ఖండించాలి. కుటుంబ గొడవల్లో హద్దులు దాటుతున్న ఈ వ్యవహారాన్ని ఎత్తి చూపాలి. అత్యుత్సాహం పదర్శించి, ఎదుటివారిని రెచ్చగొట్టి, ఆ మంటల్లో చలికాచుకునే ఈ ఛానల్ తీరును వ్యతిరేకించాలి. 

ఇకనైనా ఆ ఛానల్ అంటే మీడియా... మీడియా అంటేనే ఆ ఛానల్ అన్న విధానాన్ని మానేద్దాం. ఎవరి ఛానల్ వారికి గొప్ప. తప్పు అయిందన్నప్పుడు గౌరవంగా తప్పు కోవాలి. కానీ టీఆర్పీ రేటింగుల కోసం,  మాదే అత్యధిక వ్యూయర్ షిప్ ఉందని చెప్పుకునే రికార్డుల కోసం ఇలాంటి చిల్లర కార్యక్రమాలను తప్పని వారించాలి. 

మీడియాకు నైతిక విలువలున్నాయన్న ప్రజల నమ్మకాన్ని నిలబెడుదాం. ఒకటి, రెండు సంస్థలు చేసే తప్పును మీడియా మొత్తానికి ఆపాదించేవిధంగా వ్యవహరించడం ఆపేద్దాం. దీనిపై లోతుగా ఆలోచిద్దాం. కుటుంబాలను గౌరవిద్దాం. క్షమించమని అడిగిన వారి సంస్కారాన్ని ఆహ్వానిద్దాం. ఆలోచిద్దాం...

Mohan Babu Controversy - Fan Pain:

Mohan Babu Controversy 

Tags:   MOHAN BABU
Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ