Advertisement

తిరుపతి వైసీపీకి రాసిచ్చినట్టేనా..?

Wed 20th Mar 2024 11:46 AM
tdp   తిరుపతి వైసీపీకి రాసిచ్చినట్టేనా..?
Did you write to Tirupati YCP? తిరుపతి వైసీపీకి రాసిచ్చినట్టేనా..?
Advertisement

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుపతికి ప్రత్యేక స్థానముంది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, తిరుమలేశుడు.. శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువైనది ఇక్కడే. తిరుమల అంటే హిందూ పుణ్యక్షేత్రం, ఆనంద నిలయం కూడా. భారతదేశంలో కెల్లా అత్యంత ధనిక, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత గల ప్రదేశం. కాసేపు దైవత్వాన్ని పక్కనెట్టితే.. ఇక రాజకీయంగా చెప్పుకోవాలంటే ఇంతకుమించే మించే ఉంది. తిరుపతి నియోజకవర్గం ఏపీ రాజకీయాల్లో చాలా కీలకం. ఇక్కడ్నుంచి ఎందరో పెద్దలు చట్టసభల్లోకి అడుగుపెట్టి తమవంతుగా అభివృద్ధికి కృషిచేశారు. తిరుపతి నియోజకవర్గం ఏర్పాటైన నాటి నుంచి కాంగ్రెస్ కంచుకోట. ఆంధ్రుల ఆరాధ్యుడు, అన్నగారు నందమూరి తారకరామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత సీన్ మారిపోయింది. 1983లో 77 శాతం ఓట్లతో తిరుపతి నుంచి గెలుపొందారు. ఆ తర్వాత ఈ రికార్డును టీడీపీనే తిరగరాసింది.  2015 ఉప ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీచేసిన సుగుణమ్మ (85.69 శాతం ఓట్లు) 116,524 మెజార్టీతో గెలిచి రాష్ట్ర చరిత్రలోనే సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు. ఇక మెగాస్టార్ చిరంజీవి కూడా ప్రజారాజ్యం తరఫున 2009లో పోటీచేసి (44.12 శాతం ఓట్లు) 15930 ఓట్ల మెజార్టీతో చట్టసభల్లోకి అడుగుపెట్టారు. తన సొంత ఇలాకా అయిన పాలకొల్లు ప్రజలు ఓడించినా.. తిరుపతి ప్రజలు ఆదరించి అసెంబ్లీకి పంపిన పరిస్థితి. ఇక అవన్నీ కాస్త పక్కనెడితే 2024 ఎన్నికల్లో తిరుపతి నియోజకవర్గం హాట్‌ టాపిక్‌గా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా అందరి చూపు తిరుపతిపైనే ఉంది.

అసలేం జరుగుతోంది..?

మహామహులు పోటీచేసిన ఈ తిరుపతి నుంచి ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు..? అనేది ఇప్పుడు సామాన్యుడి నుంచి సెలబ్రిటీలు, రాజకీయ నేతలవరకూ అందరిలోనూ ఉత్కంఠ మొదలైంది. కూటమిలో భాగంగా ఈ స్థానం జనసేన దక్కించుకుంది. వైసీపీ నుంచి వలస వచ్చిన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఇక్కడ్నుంచి జనసేన తరఫున పోటీచేస్తున్నారు. అధికారికంగా ప్రకటన రానప్పటికీ అనధికారికంగా మాత్రం సేనకే దక్కిందని.. ఇక ప్రచారం చేసుకోమని ఆరణికి పవన్ చెప్పడంతో ఆయన రంగంలోకి దిగిపోయారు. ఇక్కడే అసలు సమస్య వచ్చిపడింది. ఈయన నియోజకవర్గానికి నాన్ లోకల్ కావడం, పైగా ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ కండువాలు మార్చే నాయకుడిగా పెద్ద పేరే ఉంది. ఈయన ఐదేళ్ల పాటు ఏ పార్టీలోనూ కుదురుగా ఉన్న పరిస్థితి లేదు. 2009లో ప్రజారాజ్యం, 2014లో టీడీపీ, 2019లో వైసీపీ.. 2024లో జనసేన.. 2029లో బీజేపీలో చేరతారేమో..!. ఇదీ ఈయన ట్రాక్ రికార్డ్. మూడు సార్లు పోటీచేసినా గెలిచింది మాత్రం ఒక్కసారే.. అది కూడా వైఎస్ జగన్ రెడ్డి హవాతో 2019 ఎన్నికల్లో చిత్తూరు నియోజకవర్గం నుంచే. ఇప్పుడు చిత్తూరు నుంచి తిరుపతి షిఫ్ట్ అయ్యారు. ఈయన ఎప్పుడైతే జనసేన తరఫున పోటీచేస్తున్నట్లు అనధికార ప్రకటన, బ్యానర్లు, ఫ్లెక్సీలు వెలిశాయో నాటి నుంచే రగిలిన చిచ్చు.. ఇప్పటికే ఆరణే లేదు. వాస్తవానికి ఇక్కడ సామాజిక వర్గం కలిసొస్తుందని బాగా టాక్. అందుకే ఈయన్ను ఇక్కడ్నుంచి బరిలోకి దింపారని జనసేన వర్గాలు చెప్పుకుంటున్నాయ్ కానీ.. ఇదే కూటమి చేసిన మొదటి తప్పని సొంత పార్టీ నేతలే చెప్పుకుంటున్న పరిస్థితి. జనసేన సీటు దక్కించుకోవడం బాగానే ఉంది కానీ.. అభ్యర్థి సరైనోడు కాదన్నది సొంత పార్టీ నేతలే చెవులు కొరుక్కుంటున్న పరిస్థితి.

సుగుణమ్మ ఇస్తే సులువేగా!

సుగుణమ్మ పొలిటికల్ బ్యాగ్రౌండ్ గురించి.. ఆమె క్రియేట్ చేసిన రికార్డ్ గురించి ప్రత్యేకించి ఇక చెప్పక్కర్లేదు. 2024 ఎన్నికల్లో తప్పకుండా తనకే సీటు దక్కుతుందని, గెలుపు కూడా తనదేనని భావించినప్పటికీ కూటమిలో భాగంగా ఆరణికి ఇచ్చేశారు. అయితే.. భూమన అభినయ్ రెడ్డి వైసీపీ తరఫున పోటీచేస్తుండటంతో సీన్ మారిపోయిందని తెలుస్తోంది. ఎందుకంటే ఈయన స్థానికుడు, ఐదేళ్లుగా తిరుపతిలో అభివృద్ధి అంటే చూపించిన యంగ్ లీడర్‌గా మంచి పేరుంది. డిప్యూటీ మేయర్ కావడంతో ఇదంతా సాధ్యమైంది. ప్రస్తుతం తిరుపతి ఎమ్మెల్యే, టీటీడీ చైర్మన్‌గా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడే అభినయ్. యూత్‌లో మంచి ఫాలోయింగ్, తిరుపతిలో తాను చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలే గెలిపిస్తాయని ధీమాగా ఉన్నారు. తన తండ్రి రాజకీయ అనుభవం అంతా రంగరించి, చాణక్యతతో గెలిపిస్తారని మరో నమ్మకం కూడా. కచ్చితంగా ఈసారి తనకే టికెట్ దక్కుతుందని 2019 నుంచే రంగంలోకి దిగిపోయి.. డిప్యూటీ మేయర్ పదవి హోదాలో తిరుపతిలో చేయాల్సిన పనులన్నీ చేసుకుంటూ వచ్చారు. అనుకున్నట్లుగానే టికెట్ దక్కింది కూడా. అయితే.. సుగుణమ్మ మాత్రమే అభినయ్‌ను ఎదుర్కోగలరని స్థానికంగా వినిపిస్తున్న మాట. అంతేకాదు సుగుణమ్మే సులువుగా గెలిచేస్తారనే తిరుపతి ప్రజలు చెబుతున్నారు. నిన్న మొన్నటి వరకూ బీజేపీ తరఫున కీలకంగా ఉన్న భానుప్రకాష్ రెడ్డికి టికెట్ దక్కుతుందని ప్రచారం జరిగినప్పటికీ.. సామాజికవర్గం కోణంలో ఆలోచిస్తే.. ఆరణి శ్రీనివాసులతోనే గెలుపు సాధ్యని కూటమి భావిస్తోందట. అయితే బీజేపీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో టికెట్ ఇవ్వాల్సిందేనని ఢిల్లీలోని అగ్రనేతల నుంచి ఒత్తిడి తెస్తోందట.

ఇదే జరిగితే సీన్ మారుతుందే!

ఆరణికి టికెట్ ఇచ్చేశారన్న టాక్‌తో సుగుణమ్మ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. టీడీపీ తనను నిలువెత్తునా మోసం చేసిందని ఆరోపిస్తున్నారు. కూటమిలో తనకే టికెట్ ఇవ్వాలని లేని పరిస్థితిలో పార్టీని వీడటానికి కూడా వెనుకాడనన్నట్లుగా పరోక్షంగా చెప్పకనే చెప్పేశారు. ఇక్కడే ట్విస్ట్.. ఒకవేళ జనసేనకే ఈ సీటు దక్కుతుందని అనుకుంటే టీడీపీ కండువా తీసేసి.. జనసేనలో చేరి మరీ టికెట్ తెచ్చుకుంటానని చంద్రబాబుకు ఒకింత అల్టిమేటం, సవాల్ చేశారు. పనిలో పనిగా కూటమిలో భాగంగా టికెట్ ఎవరికిచ్చినా అభ్యంతరం లేదు కానీ.. నాన్ లోకల్‌కు వద్దు.. లోకల్ ముద్దు అని చెబుతున్నారామె. సుగుణమ్మ పార్టీ మారి జనసేన టికెట్ దక్కించుకున్నా.. టీడీపీ తరఫున పోటీచేసినా పక్కాగా గెలుస్తారని టాక్ మాత్రం గట్టిగానే నడుస్తోంది. ఆరణి స్థానికేతరుడని, స్థిరత్వంలేని మనిషని తిరుపతి ప్రజలు చెబుతున్న మాట. దీంతో ఓట్లు కచ్చితంగా చీలిపోతాయని.. పార్టీపై అభిమానం ఉన్నప్పటికీ వ్యక్తి కూడా ముఖ్యమేనని ఈ సీటు విషయంలో కూటమి ఆచితూచి అడుగులేయాలని చెబుతున్నారు. ఒకవేళ ఆరణికే కన్ఫామ్ చేస్తే మాత్రం అభినయ్.. అదేనండోయ్.. వైసీపీకీ తిరుపతిని రాసిచ్చేసినట్లేనని నియోజకవర్గ ప్రజలు, రాజకీయ విశ్లేషకులు సైతం క్లియర్ కట్‌గా చెబుతున్నారు.  ఫైనల్‌గా కూటమి క్యాండిడేట్ ఎవరో .. దాన్ని బట్టి గెలుపు ఎవరిదనేది డిసైడ్ అయిపోతుంది. ఏం జరుగుతుందో లెట్స్ సీ.

Did you write to Tirupati YCP?:

BJP vs TDP

Tags:   TDP
Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement