Advertisement

చింత చచ్చినా పులుపు చావలేదట..

Tue 12th Mar 2024 09:47 PM
congress  చింత చచ్చినా పులుపు చావలేదట..
Congress vs BRS చింత చచ్చినా పులుపు చావలేదట..
Advertisement

అధికారంలో ఉన్నంత కాలం నా అంత వాడు లేడంటే ఓకే కానీ అధికారం నుంచి దిగిపోయి పార్టీ దారుణ పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా నా అంత వాడు లేడనుకోవడం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కే చెల్లు. పదవుల కోసం పార్టీలు మారే వారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదట. మరి ఎవరిని పట్టించుకుంటున్నారు. దాదాపు నేతలంతా ఎవరి దారి వాళ్లు చూసుకుంటుంటే పట్టించుకోనవసరం లేదని కథలు పడితే ఎలా? కొందరు నేతలు అధికారం ఎక్కడుంటే అక్కడకు వెళుతుంటారని.. వారిని చూసి పార్టీని నమ్ముకున్న నేతలు ఆత్మవిశ్వాసం కోల్పోవద్దని సూచించారు. అలా జంప్ చేస్తుంటే.. ఇక నమ్ముకుని ఎవరుంటారనే విషయాన్ని కూడా ఒకసారి కేసీఆర్ ఆలోచించుకోవాలి కదా?

అధికారాంతమున చూడవలె.. 

ఒకప్పుడు ప్రతిపక్షం అనేదే లేకుండా చేయాలని.. కాంగ్రెస్‌ను పూర్తిగా బీఆర్ఎస్‌లో విలీనం చేసేలా స్కెచ్ అయితే గులాబీ బాస్ కేసీఆర్ గీశారు. వర్కవుట్ కాలేదు కానీ అయ్యుంటే భూ స్థాపితం చేసేవారు. ఇప్పుడు అదే పార్టీ బీఆర్ఎస్‌ను భూ స్థాపితం చేసేలా పరిస్థితులు మారిపోయాయి. అధికారాంతమున చూడవలె.. అయ్యవారి వైభోగం అంటారే.. ఇప్పుడు కేసీఆర్ పరిస్థితి దారుణంగానే ఉంది. పైకి వాళ్లను పట్టించుకోనవసరం లేదు.. వీళ్లను పట్టించుకోనవసరం లేదని చెబుతున్నా.. తాను స్థాపించిన పార్టీ కళ్ల ముందు కుప్పకూలుతుంటే ఎవరు చూస్తూ కూర్చోలేరు కదా. ఒక్కో నేత ఒక్కో కారణం చెప్పి జంప్ అవుతున్నారు. నిజానికి ఇతర పథకాలతో పాటు ఆపరేషన్ ఆకర్ష్ అనే పథకాన్ని తెలంగాణ తీసుకొచ్చింది కూడా కేసీఆరే. 

మిగిలిన నేతలు మాత్రం ఎందుకుంటారు?

తెలంగాణలో టీడీపీతో పాటు కాంగ్రెస్ పార్టీ సైతం దశాబ్ద కాలం పాటు తన మనుగడ కోసం పోరాడటానికి కేసీఆర్ ఆపరేషన్ ఆకర్ష్ పథకమే కారణం. ఇప్పుడు అదే ఫార్ములా తమ పార్టీపై అప్లై అవుతుంటే మాత్రం సహించలేకపోతున్నారు. ఇప్పటికే చాలా మంది నేతలు పార్టీ మారారు. ఇప్పుడు కేకే, మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, కోనేరు కోనప్ప, పైళ్ల శేఖర్ రెడ్డి, గద్వాల్ విజయలక్ష్మి వంటి వారంతా కాంగ్రెస్‌లో చేరబోతున్నారట. వీరంతా వెళితే ఇక మిగిలిన నేతలు మాత్రం ఎందుకుంటారు? ఇప్పటికే చాలా మంది నేతలు బీజేపీలోకి సైతం జంప్ అయ్యారు. మనుగడ కోసం పోరాడాల్సిన సమయంలో వాళ్లను పట్టించుకోనవసరం లేదు.. వీళ్లను పట్టించుకోనవసరం లేదంటూ కబుర్లెందుకని జనం చర్చించుకుంటున్నారు. మొత్తానికి చింత చచ్చినా పులుపు చావలేదన్నట్టుగా ఉంది గులాబీ బాస్ వ్యవహారం.

Congress vs BRS:

Senior BRS leaders join Congress

Tags:   CONGRESS
Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement