Advertisementt

మీర్జాపురం రాణి కృష్ణవేణి నవలా.. కాదు సినిమా చూపించారు!

Thu 22nd Feb 2024 03:14 PM
krishnaveni novel  మీర్జాపురం రాణి కృష్ణవేణి నవలా.. కాదు సినిమా చూపించారు!
Mirzapuram Rani Krishnaveni Novel మీర్జాపురం రాణి కృష్ణవేణి నవలా.. కాదు సినిమా చూపించారు!
Advertisement
Ads by CJ

మీర్జాపురం రాణి కృష్ణవేణి అంటూ సీనియర్  జర్నలిస్టు- ప్రముఖ రచయిత భగీరథ గారు  పుస్తకం తీసుకొస్తున్నారని తెలియగానే ఆనందపడ్డాను. 

కానీ 516 పేజీల పుస్తకం అంటే ... !

చాలా ఆశ్చర్యపోయాను. 

ఇది ఆమె  ఆత్మకథా? 

లేక ఆమె ఇంటర్వ్యూలు, ఆమె గురించి వాళ్లు వీళ్లు రాసిన వ్యాసాల సంకలనమా? 

ఆ ఆత్రంతోనే పుస్తకం వచ్చి రాగానే టకటకా తిరగేసేశాను. 

నాలో ముందు రేగిన రెండు సందేహాలూ తప్పే. 

ఇది కృష్ణవేణి గారి ఆత్మ కథ కాదు. వ్యాసాల సంకలనం అంతకంటే కాదు.

చూస్తుంటే నవలలా అనిపించింది. చదవడం మొదలు పెట్టాను. 

అసలు ఎత్తుగడే ఆసక్తికరంగా అనిపించింది. 

1936 జనవరి నెలలో రాజమండ్రిలో ఓ సాయంత్రం పూట శివుడి గుడిలో శ్రీకృష్ణ తులాభారం నాటక ప్రదర్శనతో ఈ పుస్తకం మొదలవుతుంది. 

ఆ నాటికలో సత్యభామ పాత్ర ధరించిన ఓ అమ్మాయిని మద్రాసు నుంచి ప్రత్యేకంగా వచ్చిన ఓ వ్యక్తి గమనించడంతో అసలు కథ మొదలవుతుంది. 

ఆ అమ్మాయి మన కథానాయిక కృష్ణవేణి.  ఆ వచ్చినతను రేలంగి వెంకట్రామయ్య . 

ఇక్కడ్నుంచీ కృష్ణవేణి సినిమాల్లోకి ఎలా వెళ్లారు, ఎన్ని సినిమాల్లో చేశారు? మీర్జాపురం రాజాని ఎలా పెళ్లి చేసుకున్నారు? సినిమాలు ఎలా నిర్మించారు? సంసార జీవితం ఏంటి? ఇంతకుమించి ఏం ఉంటుంది అనుకుంటూనే చదువుకుంటూనే వెళ్లిపోతున్నాను. 

కానీ నేను చదవటం లేదు, చూస్తున్నానని ముందుకు వెళ్లేకొద్దీ అర్థమైంది. 

మనం చిత్తజల్లు పుల్లయ్యను చూస్తాo.

తొలి తెలుగు బాలల చిత్రం సతీ అనసూయ షూటింగ్ చూస్తాం. కృష్ణవేణి ఇంటి పరిస్థితులు గమనిస్తాం. 

మీర్జాపురం రాజాతో కృష్ణవేణి తొలి పరిచయాన్ని కొంచెం వళ్లంతా కళ్ళు చేసుకుని మరీ వీక్షిస్తాం. 

రాజావారు ఆమెను ఎలా చూస్తున్నారో ఆమెకు తెలుస్తూ ఉంటుంది, మనకూ తెలుస్తూ ఉంటుంది.

మద్రాసులోని జయ స్టూడియోలో ఉన్న ఫ్లవర్ గార్డెన్‌లో పువ్వులు కోసుకుంటుంటే రాజావారు స్వయంగా కారు నడుపుతూ కృష్ణవేణిని ఓరకంటతో చూసుకుంటూ వెళ్లారని మనకు అర్థం అవుతుంది. పనివాడితో ఆమెను బంగ్లాకు రమ్మని ఆహ్వానిస్తే, అక్కడ ఏం జరుగుతుందో అని ఆమె  గుండెలతో పాటు మన గుండెలు కూడా అదురుతుంటాయి. అప్పటికే   మీర్జాపురం రాజాకు పెళ్లయి పిల్లలు ఉన్నారు. వాళ్ళకి కూడా పెళ్లిళ్లు అయిపోయాయి. మరి కృష్ణవేణిని ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు?

ఆ సమయానికి ఆమె వయసు 16 ఏళ్లు. రాజావారి వయసు 40 పై చిలుకు. 

అంత వయసు తేడా ఉన్న కృష్ణవేణి కేవలం ఆస్తిపాస్తులు, రాణి హోదా కోసం పెళ్లి చేసుకున్నారా? 

చిత్రం ఏమిటంటే ఇలా ఆమెకు రాణి యోగo ఉందని,  పెద్ద వయసు అతనితో పెళ్లి అవుతుందని ఆమెకు ముందే జాతకం తెలియడం ఏంటో? ఇలా ప్రతిదీ ఆసక్తికరంగానే అనిపిస్తుంది.

 ఇది నిజ జీవిత కథ అని తెలిసినా, ఒక నవల చదువుతున్న అనుభూతే కలిగింది నాకు.

ఇందులో నాకు విపరీతంగా నచ్చిన అంశం మీర్జాపురం రాజా వారి వంశ చరిత్ర. 

రాణి రుద్రమదేవి నమ్మిన బంటులు గా ఉన్న ఈ వంశస్థులు తర్వాత ప్రతాపరుద్రుడికి అండగా నిలబడటం, ఢిల్లీ తుగ్లక్ సైన్యంతో పోరాటం, చివరకు నూజివీడుకి వలస రావడం, ఎవరికి వారు విడిగా సంస్థానాలు ఏర్పరచుకోవడం, తళ్లికోట యుద్ధంలో విజయనగరం తరుపున తుది వరకు నిలబడటం, నూజివీడు నుంచి విడిపోయి మీర్జాపురం సంస్థానం ఏర్పడటం, మీర్జాపురం రాజావారి రాజకీయ జీవితం, జస్టిస్ పార్టీ తో అనుబంధం, తర్వాత రాజకీయాలంటే విరక్తి కలిగి సినిమాల్లోకి చేరటం…. ఈ చరిత్రను అంతా ఈ పుస్తకంలో కళ్ళకు కట్టినట్లు చూపించారు.

కృష్ణవేణి సినిమా జీవితం, నిర్మాతగా దూకుడు, మహానటుడు ఎన్టీఆర్ ని మన దేశంతో నటునిగా పరిచయం చేయటం, మీర్జాపురం రాజా వారి హఠాన్మరణం, ఆ తర్వాత పరిస్థితులు…. అక్కడితో ఈ కథ ఆపేయలేదు. చివరి వరకు ఏదో ఒక ఆసక్తికరమైన అంశాలను సమ్మిళితం చేస్తూ ఓ సంపూర్ణమైన ముగింపు ఇచ్చారు.

అసలు కృష్ణవేణి స్వయంగా ఆత్మ కథ రాసుకున్నా ఇంత గొప్పగా వచ్చి ఉండేది కాదేమో. అంత బాగా ఆమె  జీవితాన్ని సినిమాలాగా చూపించారు. ఈ విషయంలో భగీరథగారి కష్టం, ఇష్టం అక్షరమక్షరంలోనూ కనిపిస్తాయి. 

ఎక్కడా పద డాంబికాలు లేవు. సింపుల్ వాక్యాలు, ఆసక్తిని కలిగించే  రచనా శైలి. 

ఇలా ఒక సినిమా పుస్తకాన్ని ఇంతలా ఆకట్టుకునేలా నవలలాగా రాయడం గ్రేట్ టెక్నిక్.

అలాగని ఆయన ఎక్కడా ఎగ్జాగిరేషన్‌కి పోయినట్టు లేదు. 

అన్నీ వాస్తవాలే. 

అంతా చరిత్రే.

నాకైతే ఈ పుస్తకం - కృష్ణవేణి జీవిత చరిత్రలాగా అనిపించలేదు. 

తెలుగు సినిమా చరిత్రలో సగ భాగం ఇందులోనే ఉన్నట్టు అనిపించింది. భగీరథగారితో నాకు ఎక్కువ పరిచయము లేదు. అలాగని తక్కువ పరిచయమూ లేదు. 

నేను ఫిల్మ్ జర్నలిజంలోకి అడుగుపెట్టే సమయానికి మోహన్ కుమార్‌గారు, భగీరథగారు, పసుపులేటి రామారావుగారు, ఎమ్మెల్ నరసింహo గారు వంటి హేమాహేమీలంతా ఫుల్ యాక్టివ్ మోడ్‌లోనే ఉన్నారు. 

వాళ్లంటే ఉండే గౌరవంతో 

నేను కొంచెం దూరం దూరంగా ఉన్నా, వాళ్లే నన్ను చనువుతో దగ్గరకు తీసుకున్నారు. 

వైట్ అండ్ వైట్ డ్రెస్‌లో 

చాలా సుతిమెత్తగా కనబడే భగీరథ గారిలో ... 

నేను ఎన్నడూ పరుష వాక్యాలు కానీ, కోపం కానీ వినలేదు, చూడలేదు. ఆయన పని, ఆయన ప్రపంచం అన్నట్టుగా ఉండేవారు. 

ఎప్పుడు కనబడ్డా ఏం చిన్నారాయణా... ఏం చేస్తున్నావ్ అంటూ ఆత్మీయంగా పలకరిస్తుంటారు. 

ఆయన 19 పుస్తకాలు రాశారు. వాటన్నిటికంటే గొప్ప విషయం ఏమిటంటే - ఆయన రాసిన నాగలాదేవి నవలను బళ్లారిలోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం వారు బి యస్సీ డిగ్రీ వివిద్యార్థులకు పాఠ్యాంశంగా తీసుకోవటం. అలాగే ఆయన సమగ్ర సాహిత్యంపై హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో పరిశోధన జరగటం. తెలుగు సినిమా జర్నలిస్టులంతా గర్వపడాల్సిన అంశం ఇది.

ఈ పుస్తకం పూర్తవగానే నాకు లోటుగా అనిపించినవి రెండు విషయాలు.

 కృష్ణవేణి గారు ఉన్నప్పుడే ఈ పుస్తకం వచ్చి ఉంటే, ఆవిడ ఎంత మురిసిపోయేవారో కదా అనిపించింది. 

ఇంకొక లోటు ఏంటంటే- నటిగా,  నిర్మాతగా ఆమె సినిమాల జాబితాను పుస్తకం చివర్లో ఇచ్చి ఉంటే బాగుండేది. 

ఏది ఏమైనా హ్యాట్సాఫ్ భగీరథగారు. మీ సీనియారిటీ, దానికంటే ఎక్కువగా మీ సిన్సియారిటీ ఈ పుస్తకంలో కనిపిస్తోంది. ఏదో రాసి తోసి పారేసినట్టుగా కాకుండా ఎంతో ఒద్దికగా, ఒడుపుగా చాలా భక్తిశ్రద్ధలతో రాసినట్టుగా అనిపించింది. 

మామూలుగా ఎవరినైనా ఒక కార్యం బాగా నిర్వహించడానికి భగీరథ ప్రయత్నం చెయ్యమంటారు. మీ పేరులోనే భగీరథ ఉంది. మీరు అందుకే అంతకన్నా ఎక్కువే చేశారు. 

516 పేజీల ఈ పుస్తకం వెల: 750 రూపాయలు

ప్రతులకు:

శ్రుతి బిజినెస్ సెంటర్, జూబిలీహిల్స్ , హైదరాబాద్. 

ఫోన్ : 040 23555617.

- పులగం చిన్నారాయణ

krishnaveni novel

Mirzapuram Rani Krishnaveni Novel:

Mirzapuram Rani Krishnaveni 

Tags:   KRISHNAVENI NOVEL
Advertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ