ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్ భాగస్వామ్యంలో ఏపీపై భారీ కుట్ర జరగనుందా? అంటే జరుగుతున్న పరిణామాలన్నీ ఔననే అంటున్నాయి. ఏపీని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్లేందుకు 2014లో అప్పటి సీఎం సంకల్పం తీసుకున్నారు. ఏమీ లేని ఏపీలో అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్లాలంటే పదేళ్లయినా సమయం పడుతుంది. కానీ ఐదేళ్లకే ఏపీ ప్రజానీకం చంద్రబాబు పాలనకు ఉద్వాసన పలికి.. ఒక్క ఛాన్స్ అని అడిగిన జగన్‌కు అధికారాన్ని కట్టబెట్టారు. ఇది కాస్త తెలంగాణ సీఎం కేసీఆర్‌కు వరంగా మారింది. జగన్ పరిపాలనా దక్షత లేకపోవడమో.. మొండితనమో కానీ ఏపీ సర్వనాశనం.
మూడు రాజధానుల పేరుతో అమరావతిని సర్వనాశనం చేసేశారు. వేల రూపాయలు మాత్రమే విలువ చేసే భూములు చంద్రబాబు హయాంలో లక్షలకు పరుగందుకున్నాయి. ఇక జగన్ టైంలో తిరిగి వేలకే వచ్చేశాయి. కానీ తెలంగాణలో సీన్ రివర్స్. తెలంగాణలో ఒక్క ఎకరా భూమి అమ్మితే ఏపీలో 50 ఎకరాలు కొనవచ్చనేలా పెరిగిపోయాయి ధరలు. ఇదే విషయాన్ని కేసీఆర్ హైలైట్ చేస్తున్నారు. ఏపీ అభివృద్ధిని తెలంగాణ అభివృద్ధితో ముడిపెట్టి మరీ చూపించి లబ్ది పొందుతున్నారు. అప్పట్లో చంద్రబాబు అయితే మొత్తుకున్నారు. ఏపీపై కేసీఆర్ కుట్రలు పన్నుతున్నారని. కానీ వినే నాధుడేడి? ప్రపంచంలోనే చెత్త పొలిటీషయన్‌గా చంద్రబాబును అభివర్ణించి తన మాటల మాయాజాలంతో జనం మెదళ్లలోకి ఎక్కించడంలో కేసీఆర్ సక్సెస్ అయ్యారు.
వెరసి చంద్రబాబు నుంచి అధికారం జగన్‌కు ట్రాన్స్‌ఫర్ అయ్యింది. జగన్ అధికారంలోకి రావడానికి ముందు ఇచ్చిన హామీలన్నీ గంగలో కలిపేశారు. గోదావరి నీళ్లను కాళేశ్వరం రూపంలోనూ.. పాలమూరు-రంగారెడ్డి ద్వారా కృష్ణా నీటిని కేసీఆర్‌కు అప్పగించారు. ఫలితంగా రాయలసీమ, కోస్తాలు ఎడారిగా మారబోతున్నాయి. అధికారంలోకి వచ్చేంత వరకూ అమరావతే రాజధాని అని.. ఆ తరువాత 3 రాజధానుల పల్లవి అందుకున్నారు. అమరావతి చంద్రబాబు నిర్మించిందనో ఏమో కానీ దానిని సర్వనాశనం చేశారు. అది కాస్తా హైదరాబాద్‌కు వరంగా మారింది. ఇప్పుడు చంద్రబాబును ఏకంగా జైలుకు పంపారు. దీనిలో ప్రధాని మోదీ, కేసీఆర్‌లు కూడా సూత్రధారులనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొత్తానికి చంద్రబాబుని జైలుకు పంపి.. ఏపీ మరింత విధ్వంసానికి మోదీ, కేసీఆర్, జగన్‌లు తెరదీస్తున్నారని ప్రచారం జరుగుతోంది.