గాన కోకిల గొంతు మూగబోయింది. సాటిలేని స్వరం స్వర్గానికి చేరింది. ప్రముఖ గాయనీమణి, ప్రతిష్టాత్మకమైన భారతరత్న పురస్కార గ్రహీత లత మంగేష్కర్ ( 92 ) ఆదివారం ఉదయం ఆఖరి శ్వాస వదిలారు. అమృతతుల్యమైన గానంతో పాటు అత్యుత్తమమైన వ్యక్తిత్వంతో సామాన్యుడి నుంచీ సచిన్ టెండూల్కర్ వరకూ కోట్లాదిమందిని తనకు అభిమానులుగా మార్చుకున్న లతాజీ మృతి పట్ల యావత్ భారతావని విచారం వ్యక్తం చేస్తోంది. స్వల్ప కోవిడ్ లక్షణాలతో హాస్పిటల్ లో అడ్మిట్ అయిన లత మంగేష్కర్ తొలుత కోలుకున్నప్పటికీ గత రెండు రోజులుగా మళ్ళీ క్షీణించిన ఆరోగ్యం ఆమెను శివైక్యం వరకూ తీసుకువెళ్లిపోయింది. నైటింగేల్ ఆఫ్ ఇండియన్ సినిమాగా ఖ్యాతి గాంచుతూ దేశంలోని అన్ని భాషలలోనూ పాటలు పాడిన ఘనత లతాజీ సొంతం. వేలాది గీతాలకు తన గాత్రంతో ప్రాణం పోసిన లత మంగేష్కర్ ని కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్, పద్మ విభూషణ్ తో పాటు భారత అత్యున్నత పురస్కారమైన భారతరత్ననూ అందించి సత్కరించింది. అలాగే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డునీ, ఫ్రాన్స్ ప్రభుత్వం ప్రకటించిన ది లీజియన్ ఆఫ్ హానర్ నీ కూడా స్వీకరించిన లతాజీ ఖాతాలో ఫిలింఫేర్ వంటి అవార్డులైతే లెక్కలేనన్ని ఉన్నాయి. నేపథ్య గాయనిగానే కాక కొన్ని చిత్రాలకు సంగీత దర్శకురాలిగాను, నిర్మాతగానూ వ్యవహరించిన లతా మంగేష్కర్ నిర్యాణం మనందరికీ తీరని లోటే. ఈ బాధకు మందు ఆవిడ ఆలపించిన పాటే.!