Advertisement

2021: బారులు తీర‌నున్న భారీ సినిమాలు!

Mon 13th Jul 2020 01:57 PM
tollywood,2021 crazy movies,acharya,rrr,bb3,radhe shyam,viroopaksha,vakeel saab,sarkaru vaari pata,pushpa,red,boxer,fighter  2021: బారులు తీర‌నున్న భారీ సినిమాలు!
Tollywood Crazy Movies Eye on 2021 2021: బారులు తీర‌నున్న భారీ సినిమాలు!
Advertisement

ఈ ఏడాది స‌గం గ‌డిచిపోయింది. క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా టాలీవుడ్ భారీగా న‌ష్ట‌పోయింది. సంక్రాంతికి వ‌చ్చిన రెండు సినిమాలు ‘అల.. వైకుంఠ‌పుర‌ములో’, ‘స‌రిలేరు నీకెవ్వ‌రు’ మాత్ర‌మే భారీ హిట్లుగా న‌మోద‌య్యాయి. ఆ త‌ర్వాత ‘భీష్మ‌’, ‘హిట్’ మూవీస్ వాటి స్థాయిలో హిట్ట‌య్యాయి. క్రేజీ ప్రాజెక్టుల‌నుకున్న ‘వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్‌’, ‘డిస్కో రాజా’ సినిమాలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర తోక‌ముడిచాయి. వాటి కార‌ణంగా బ‌య్య‌ర్లు భారీ న‌ష్టాలు చ‌విచూశారు. అతిపెద్ద సీజ‌న్ అయిన వేస‌విలో థియేట‌ర్ల మూత కార‌ణంగా సినిమాలు రిలీజ్ కాక‌పోవ‌డం ప‌రిశ్ర‌మ‌కు పెద్ద దెబ్బ‌. ఇక ఈ ఏడాది చివ‌రిలోగా పెద్ద సినిమాలేవైనా విడుద‌లవుతాయా అనేది సందేహాస్పదంగా మారింది. వ‌స్తే గిస్తే.. ‘వ‌కీల్ సాబ్‌’, ‘నార‌ప్ప’, ‘క్రాక్‌’ సినిమాలు మాత్ర‌మే వ‌చ్చే అవకాశం ఉంది.

అయితే 2021లో భారీ సినిమాలు బారులు తీరనుండ‌టంతో ఇండ‌స్ట్రీ కుదుట‌ప‌డుతుంద‌నే అభిప్రాయాన్ని విశ్లేష‌కులు వ్య‌క్తం చేస్తున్నారు. ట్రేడ్ స‌ర్కిల్స్‌తో పాటు సామాన్య ప్రేక్ష‌కుల్లోనూ ఆస‌క్తి క‌లిగిస్తోన్న ఆ సినిమాల్లో య‌స్‌.య‌స్‌. రాజ‌మౌళి-జూనియ‌ర్ ఎన్టీఆర్‌-రామ్‌చ‌ర‌ణ్ ‘ఆర్ ఆర్ ఆర్‌’, ప్ర‌భాస్‌-రాధాకృష్ణ కుమార్ ‘రాధే శ్యామ్‌’, చిరంజీవి-కొర‌టాల శివ ‘ఆచార్య‌’, ప‌వ‌న్ క‌ల్యాణ్‌-క్రిష్ ‘విరూపాక్ష‌’, మ‌హేశ్‌-ప‌ర‌శురామ్ ‘స‌ర్కారువారి పాట‌’, అల్లు అర్జున్‌-సుకుమార్ ‘పుష్ప‌’, బాల‌కృష్ణ‌-బోయ‌పాటి ‘బీబీ3’, పూరి జ‌గ‌న్నాథ్‌-విజ‌య్ దేవ‌ర‌కొండ ‘ఫైట‌ర్‌’, రామ్‌-కిశోర్ తిరుమ‌ల ‘రెడ్‌’, వ‌రుణ్‌తేజ్‌-కిర‌ణ్ కొర్ర‌పాటి ‘బాక్స‌ర్’ ఉన్నాయి. ఇవ‌న్నీ క్రేజీ ప్రాజెక్టులే అన‌డంలో సందేహం లేదు.

వీటిలో ముందుగా పూరి-విజ‌య్ సినిమా ‘ఫైట‌ర్’ ప్రేక్ష‌కుల ముందుకు రావ‌చ్చు. విజ‌య్ మునుప‌టి రెండు సినిమాలు ఆశించిన రీతిలో ప్రేక్ష‌కుల్ని అల‌రించ‌క‌పోయినా ‘ఇస్మార్ట్ శంక‌ర్’ మూవీతో పూరి జ‌గ‌న్నాథ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ కొట్ట‌డంతో ‘ఫైట‌ర్‌’పై అంచ‌నాలు బాగా ఉన్నాయి.

మెగాస్టార్ చిరంజీవి సినిమా వ‌స్తోందంటే ఉంటే హ‌డావిడి సంగ‌తి అంద‌రికీ తెలుసు. దానికి త‌గ్గ‌ట్లు ‘ఆచార్య’ సినిమా విష‌యంలో అంచ‌నాలు అంబ‌రాన్ని అంటుతుండ‌టం స‌హ‌జ‌మే! చిరంజీవి ఇమేజ్‌కు త‌గ్గ‌ట్లు ఈ మూవీని తీర్చిదిద్దుతున్నాడు డైరెక్ట‌ర్ కొర‌టాల శివ‌. ఓట‌మి ఎరుగ‌ని ద‌ర్శ‌కునిగా వ‌రుస నాలుగు హిట్ల‌తో అత‌ను మంచి ఫామ్‌లో ఉన్నాడు. 2021 వేస‌విలో ఈ సినిమాని విడుద‌ల చేయాల‌ని నిర్మాతలు రామ్‌చ‌ర‌ణ్‌, నిరంజ‌న్‌రెడ్డి భావిస్తున్నారు.

డైరెక్ట‌ర్‌గా రాజ‌మౌళికి తిరుగులేద‌నే అభిప్రాయం నేప‌థ్యంలో ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ రూపొందుతోంది. ఆయ‌న మునుప‌టి రెండు సినిమాలు ‘బాహుబ‌లి: ద బిగినింగ్‌’, ‘బాహుబ‌లి: ద క‌న్‌క్లూజ‌న్’ ఒక‌దాన్ని మించి ఒక‌టి దేశ‌వ్యాప్తంగా రికార్డులు సృష్టించాయి. రాజ‌మౌళిని దేశంలోనే నంబ‌ర్‌వ‌న్ డైరెక్ట‌ర్‌గా అవి నిల‌బెట్టాయి. ఇలాంటి స్థితిలో తార‌క్‌, చ‌ర‌ణ్‌ల‌తో ఆయ‌న తీస్తున్న ఆర్ ఆర్ ఆర్ మ‌రో సంచ‌ల‌నం సృష్టిస్తుంద‌నే అభిప్రాయం అంద‌రిలోనూ క‌నిపిస్తోంది. అల్లూరి సీతారామ‌రాజు, కొమ‌రం భీమ్ పాత్ర‌ల‌తో కాల్ప‌నిక క‌థ‌తో త‌యార‌వుతున్న ఈ సినిమా 2021 వేస‌విలో రానున్న‌ది.

‘బాహుబ‌లి’ సినిమాల అమేయ‌మైన విజ‌యంతో ప్ర‌భాస్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. ‘సాహో’ తెలుగు వెర్ష‌న్ ఆశించిన రీతిలో క‌లెక్ష‌న్లు తేక‌పోయినా పాన్ ఇండియా స్టార్‌గా అత‌డిని నిలిపింది. రాధాకృష్ణ కుమార్ డైరెక్ష‌న్‌లో అత‌ను చేస్తున్న ల‌వ్ స్టోరీ ‘రాధే శ్యామ్‌’పై అంచ‌నాలు అంబ‌రాన్ని తాకుతుండ‌టం స‌హ‌జ‌మే. క‌రోనా కాలంలోనూ దానికి బిజినెస్ వ‌ర్గాల్లో అత్యంత కుతూహ‌లాన్ని ఆ సినిమా క‌లిగిస్తోంది. ఈ సినిమా సైతం వేస‌వినే టార్గెట్ చేసుకుంది.

‘వ‌కీల్ సాబ్’ క‌నుక ఈ ఏడాది విడుద‌లయ్యే వీలు లేక‌పోతే ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమాలు ఒక‌టి కాకుండా రెండు 2021లో వ‌స్తాయి. బాలీవుడ్ హిట్ ‘పింక్‌’కు రీమేక్‌గా త‌యార‌వుతున్న ‘వ‌కీల్ సాబ్‌’లో పీకే టైటిల్ రోల్ చేస్తున్నాడు. దీని క‌థేమిటో ఇప్ప‌టికే అంద‌రికీ తెలుసు. శ్రీ‌రామ్ వేణు డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రంలో పీకే లుక్‌కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఇది 2021 ఆరంభంలో రావ‌చ్చు. ఆ త‌ర్వాత క్రిష్ డైరెక్ట్ చేస్తోన్న సినిమా ‘విరూపాక్ష’ (ప‌రిశీల‌న‌లో ఉన్న టైటిల్‌) ఏడాది చివ‌ర‌లో.. బ‌హుశా ద‌స‌రాకు వ‌చ్చే అవ‌కాశాలున్నాయి. తెలంగాణ రాబిన్‌హుడ్‌గా పేరుపొందిన పండుగ సాయ‌న్న క‌థ ఆధారంగా ఈ సినిమాని క్రిష్ తీస్తున్నాడ‌నే ప్ర‌చారం ఉంది. మునుప‌టి మూవీ ‘అజ్ఞాత‌వాసి’ డిజాస్ట‌ర్ అయిన‌ప్ప‌టికీ ప‌వ‌ర్‌స్టార్ సినిమా అంటే ఆ క్రేజే వేరు. ‘వ‌కీల్ సాబ్‌’, ‘విరూపాక్ష’ సినిమాల్లో ఏ ఒక్క‌టి హిట్ట‌యినా ఆయ‌న రేంజ్ క‌లెక్ష‌న్లు ఎలా ఉంటాయో అంద‌రూ చూస్తారు.

‘స‌రిలేరు నీకెవ్వ‌రు’ మూవీతో కెరీర్ హ‌య్యెస్ట్ గ్రాస‌ర్‌ను సాధించిన మ‌హేశ్ ఇప్ప‌టివ‌ర‌కూ ‘స‌ర్కారువారి పాట’ సెట్స్ మీద‌కు వెళ్ల‌లేదు. అయితే ఒక‌సారి షూటింగ్ మొద‌లైతే చ‌క‌చ‌కా తీసెయ్య‌డానికి సిద్ధంగా ఉన్నాడు డైరెక్ట‌ర్ ప‌ర‌శురామ్‌. ఆ ఇద్ద‌రి తొలి క‌ల‌యిక‌లో వ‌స్తోన్న ఈ సినిమా టైటిల్‌, ప్రీలుక్ ఇప్ప‌టికే సోష‌ల్ మీడియాలో ఒక వేవ్‌ను సృష్టించాయి. ఈ మ‌ధ్య కాలంలో తొలిసారి జ‌ట్టుక‌ట్టిన ప్ర‌తి డైరెక్ట‌ర్‌తోనూ హిట్‌ను అందుకుంటూ వ‌స్తోన్న మ‌హేశ్‌.. ఈ సినిమాతోనూ అదే రిజ‌ల్ట్‌ను కొన‌సాగించే అవ‌కాశాలున్నాయ‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. 2021 ద్వితీయార్ధంలో ఈ సినిమా రావ‌చ్చు.

ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్ అయిన ‘అల‌.. వైకుంఠ‌పుర‌ములో’ మూవీతో అల్లు అర్జున్ క్రేజ్‌, ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. ఆ సినిమాలో బ‌న్నీ ప్ర‌తి మూమెంట్‌నూ ఆడియెన్స్ ఎంజాయ్ చేశారు. ఇప్పుడు ‘ఆర్య’ మూవీతో త‌న‌కు స్టార్ స్టేట‌స్ తీసుకొచ్చిన సుకుమార్ డైరెక్ష‌న్‌లో ‘పుష్ప’ మూవీ చేస్తున్నాడు బ‌న్నీ. ‘రంగ‌స్థ‌లం’ వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ త‌ర్వాత సుక్కు చేస్తున్న సినిమా కావ‌డంతో ‘పుష్ప‌’పై వెల్లువెత్తుతున్న అంచ‌నాల‌కు ఆకాశ‌మే హ‌ద్దు. ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్ ముఠాలో ట్ర‌క్ డ్రైవ‌ర్ పుష్ప‌రాజ్‌గా బ‌న్నీ లుక్ ఇప్ప‌టికే ఆక‌ట్టుకుంది. 2021 ద‌స‌రాలోగా ఈ మూవీ విడుద‌ల‌వుతుంద‌ని అనుకుంటున్నారు.

మిగ‌తా డైరెక్ట‌ర్ల‌తో బాల‌కృష్ణ చేసే సినిమాల‌తో పోలిస్తే బోయపాటి శ్రీ‌నుతో కాంబినేష‌న్ అంటే ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తి త‌ప్ప‌కుండా ఉంటుంది. అలాంటి హిట్లను బాల‌య్య‌కు బోయ‌పాటి అందించాడు మ‌రి. ‘సింహా’, ‘లెజెండ్’ సినిమాలు బాల‌య్య క్లిష్ట ప‌రిస్థితిని ఎదుర్కొంటున్న సంద‌ర్భాల్లోనే వ‌చ్చి, ఆయ‌న‌ను నిల‌బెట్టాయి. ఇప్పుడూ బాల‌య్య క్లిష్ట స్థితినే ఎదుర్కొంటున్నాడు. ఈ నేప‌థ్యంలో ‘బీబీ3’ మూవీ ఆయ‌న‌ను నిల‌బెడుతుంద‌ని అభిమానులు కొండంత ఆశ‌లు పెట్టుకున్నారు. ఇది 2021 ద‌స‌రాలోగా రావ‌చ్చు.

వీటితో పాటు రామ్ ‘రెడ్‌’, వ‌రుణ్‌తేజ్ ‘బాక్స‌ర్’ మూవీస్ కూడా 2021 క్రేజీ ప్రాజెక్టులుగా రానున్నాయి. ‘ఇస్మార్ట్ శంక‌ర్‌’తో రామ్‌, ‘గ‌ద్ద‌ల‌కొండ‌ గ‌ణేష్‌’గా వ‌రుణ్‌తేజ్ అల‌రించ‌డంతో ఆ సినిమాల‌పై కూడా అంద‌రి దృష్టీ ఉండ‌టం స‌హ‌జ‌మే. ఒక‌దాని త‌ర్వాత ఒక‌టిగా వ‌చ్చే ఈ క్రేజీ సినిమాల‌తో 2021 సంవ‌త్స‌రం సినీ ప్రియుల‌ను అల‌రించ‌డం త‌థ్యం.

Tollywood Crazy Movies Eye on 2021:

Movies Delayed Because of Coronavirus and Release details

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement