17 ఏళ్ల కెరీర్‌.. చెక్కు చెద‌రని న‌య‌న్ గ్లామ‌ర్‌!

17 Years career No Change in Nayanthara Glamour

Wed 01st Jul 2020 12:55 PM
nayanthara,lady super star,evergreen,17 years career,nayanthara glamour  17 ఏళ్ల కెరీర్‌.. చెక్కు చెద‌రని న‌య‌న్ గ్లామ‌ర్‌!
17 Years career No Change in Nayanthara Glamour 17 ఏళ్ల కెరీర్‌.. చెక్కు చెద‌రని న‌య‌న్ గ్లామ‌ర్‌!
Advertisement

డ‌బ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సుల్లో పేరు తెచ్చుకోవ‌డం హీరోయిన్ల విష‌యంలో చాలా అరుదు. ‘ప్రేమ‌సాగ‌రం’తో తెలుగులోనూ మంచి పేరు తెచ్చుకున్న న‌ళిని త‌ర్వాత ఆ స్థాయిలో మ‌ళ్లీ పేరు తెచ్చ‌కుంది న‌య‌న‌తారే! అవును. సూప‌ర్‌హిట్ డ‌బ్బింగ్ సినిమా చంద్ర‌ముఖిలో ర‌జ‌నీకాంత్ స‌ర‌స‌న హీరోయిన్‌గా న‌టించి, ‘చిలుకా ప‌ద ప‌ద‌.. నెమ‌లీ ప‌ద ప‌ద’ అంటూ వ‌య్యారాలు ఒలికించి, తెలుగు ప్రేక్ష‌కుల హృద‌యాల్లో స్థానం సంపాదించుకుంది ఈ మ‌ల‌యాళీ భామ‌.

ఏదేమైనా ఆ త‌ర్వాత విక్ట‌రీ వెంక‌టేష్ జోడీగా చేసిన స్ట్ర‌యిట్ సినిమా ‘ల‌క్ష్మీ’తో ఆమె టాప్ హీరోయిన్ రేసులోకి వ‌చ్చేసింది. మొద‌ట్లో కాస్తంత బొద్దుగా, ఆక‌ర్ష‌ణీయంగా ఉండే న‌య‌న‌తార ఇటు చీర‌క‌ట్టులోనూ, అటు మోడ‌ర‌న్ డ్ర‌స్సుల్లోనూ ఒదిగిపోగ‌ల స‌మ‌ర్థురాలిగా పేరు తెచ్చుకుంది. దుబాయ్ శీను, తుల‌సి, అదుర్స్‌, సింహా, శ్రీ‌రామ‌రాజ్యం, బాబు బంగారం, సైరా న‌ర‌సింహారెడ్డి వంటి సినిమాల్లో త‌న న‌ట‌న‌తో, అపురూప లావ‌ణ్యంతో అల‌రించింది. బాపు రూపొందించిన ‘శ్రీ‌రామ‌రాజ్యం’ చిత్రంలో సీత‌గా ఆమె ప్ర‌ద‌ర్శించిన అభిన‌యం అపూర్వ‌మ‌ని ఇటు విమ‌ర్శ‌కులు, అటు ప్రేక్ష‌కులు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు.

మొద‌ట్నుంచీ తెలుగు కంటే త‌మిళ సినిమాల‌కే అధిక ప్రాధాన్యం ఇస్తూ రావ‌డం, డేట్స్ ప్రాబ్లెమ్‌తో తెలుగులో ప‌లు ఆఫ‌ర్ల‌ను తిర‌స్క‌రించ‌డం వ‌ల్ల తెలుగు ప్రేక్ష‌కులు ఎక్కువ‌గా ఆమె న‌ట‌న‌ను ఆస్వాదించే అవ‌కాశం కోల్పోయారు. తెలుగులో ఆమె ఎంచుకున్న కొన్ని సినిమాలు స‌రిగా ఆడ‌క‌పోవ‌డం వ‌ల్ల మ‌ధ్య‌లో ఆమె క్రేజ్ త‌గ్గిన‌ట్లు కూడా అనిపించింది. ‘శ్రీ‌రామ‌రాజ్యం’ చిత్రంలో మ‌హాసాధ్వి సీత పాత్ర‌లో ఆమెను ఆరాధించిన ప్రేక్ష‌కులు కొంత‌కాలం మామూలు క్యారెక్ట‌ర్ల‌లో ఆమెను ఆద‌రించ‌లేదు. ‘గ్రీకువీరుడు’, ‘అనామిక’ సినిమాలు ప‌రాజ‌యం పాల‌య్యాక రెండేళ్ల విరామంతో వెంక‌టేష్ స‌ర‌స‌న న‌టించిన ‘బాబు బంగారం’తో మ‌ళ్లీ తెలుగువాళ్ల‌ను ప‌ల‌క‌రించింది న‌య‌న్‌. దాని త‌ర్వాత కూడా రెండేళ్ల గ్యాప్‌తో బాల‌కృష్ణ‌తో మూడోసారి ‘జై సింహా’లో న‌టించింది.

గ‌త ఏడాది ‘సైరా’ చిత్రంలో ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి భార్య సిద్ధ‌మ్మ‌గా క‌నిపించిన ఆమె, మ‌ళ్లీ ఇంత‌దాకా మ‌రో తెలుగు సినిమా అంగీక‌రించ‌లేదు. అయితే ఆమె చేతిలో ప్ర‌స్తుతం నాలుగు త‌మిళ సినిమాలు ఉండ‌టం గ‌మ‌నార్హం. 2003లో ఒక మ‌ల‌యాళ చిత్రంలో నాయిక‌గా న‌టించ‌డం ద్వారా సినిమాల్లోకి అడుగుపెట్టిన న‌య‌న్ ప‌దిహేడేళ్లుగా చెక్కుచెద‌ర‌ని గ్లామ‌ర్‌తో ఇప్ప‌టికీ అగ్ర‌శ్రేణి హీరోయిన్‌గా రాణిస్తుండ‌టం, అత్య‌ధిక పారితోషికం తీసుకుంటున్న సౌత్ ఇండియ‌న్ హీరోయిన్ల‌లో ఒక‌రిగా నిలుస్తుండ‌టం చిన్న విష‌యం కాదు. ఒక‌వైపు హీరో ప్రాధాన్య చిత్రాల్లో నాయిక‌గా న‌టిస్తూ, మ‌రోవైపు లేడీ ఓరియంటెడ్ మూవీస్‌లో త‌న హ‌వా ప్ర‌ద‌ర్శిస్తూ వ‌స్తోన్న న‌య‌న‌తార త్వ‌ర‌లోనే దాంప‌త్య జీవితంలోకి అడుగుపెట్ట‌నున్న‌ది. త‌మిళ ద‌ర్శ‌కుడు విఘ్నేష్ శివ‌న్‌తో కొంత‌కాలంగా ప్రేమ‌లో ఉన్న ఆమె 2021లో అత‌డిని పెళ్లాడ‌నున్న‌ట్లు కోలీవుడ్‌లో ప్ర‌చారం జ‌రుగుతోంది.

17 Years career No Change in Nayanthara Glamour :

Nayanthara evergreen Lady super star 


Loading..
Loading..
Loading..
advertisement